Begin typing your search above and press return to search.

చైనాలోని 6 నగరాల్లో కాలుష్య రెడ్ అలెర్ట్

By:  Tupaki Desk   |   24 Dec 2015 10:37 AM IST
చైనాలోని 6 నగరాల్లో కాలుష్య రెడ్ అలెర్ట్
X
డిసెంబరు 6న వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో చైనా రాజధాని బీజింగ్ మహానగరంలో రెడ్ అలెర్ట్ ప్రకటించటం తెలిసిందే. వీలైనంతవరకూ ఇళ్లల్లో ఉండాలని.. బయటకు రావొద్దని.. అతి ముఖ్యమైన పనులు ఉంటే తప్పించి వీలైనంతవరకూ ఇంట్లోనే ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసింది. ఓపక్క ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. విపరీతమైన వాయుకాలుష్యం.. పొగ మంచుకాలుష్యం చైనాలోని ఆరు నగరాల్ని చుట్టేయటంతో.. తాజాగా బీజింగ్ సహా ఆరునగరాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.

బీజింగ్ లో ఇప్పటికి రెండుదఫాలు రెడ్ అలెర్ట్ ప్రకటించటం తెలిసిందే. తాజాగా మూడోసారి రెడ్ అలెర్ట్ ప్రకటిస్తే.. మిగిలిన ఐదు నగరాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించటం ఇదే తొలిసారి. రెడ్ అలెర్ట్ ప్రకటించిన నగరాల్లో వాహనాల రాకపోకల మీద పరిమితులతో పాటు.. స్కూళ్లు.. ఆఫీసుల నిర్వహణలో ఆంక్షలు విధిస్తారు. వీలైనంత తక్కువగా ఇళ్లల్లో నుంచి బయటకు రావాలని కోరతారు. నిర్మాణ పనులు.. పరిశ్రమల్లో కార్యకలాపాల్ని నిలిపివేస్తారు.

ఇంత తీవ్రంగా ఉన్న వాతావరణ కాలుష్యం సాంకేతికంగా ఏ రేంజ్ లో ఉందన్న లెక్కల్లోకి వెళితే.. షాక్ తినాల్సిందే. ఎందుకంటే.. బీజింగ్ లోని వాయు కాలుష్య తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. 2.5మైక్రో మీటర్ల సూక్ష్మధూళికణాల సాంద్రం 500కు దాటింది. సురక్షిత వాతావరణంలో ఉండాల్సింది 50 మాత్రమే. ఈ మధ్యన బీజింగ్ లో తీసుకున్న జాగ్రత్తలతో ఇప్పుడు 450గా ఉంది. మరోవైపు బీజింగ్ బాటలో నడిచేలా దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం ఢిల్లీలో సూక్ష్మధూళికణాల సాంద్రత 295గా నమోదైంది. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం.. ఢిల్లీలో అత్యంత కలుషితమైన రోజుగా డిసెంబర్ 23ను అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే.. బీజింగ్ పరిస్థితుల్లోకి వెళ్లటానికి దేశ రాజధాని చాలా దగ్గర్లో ఉందన్న విషయం మర్చిపోకూడదు.