Begin typing your search above and press return to search.

‘బాయ్ కాట్ చైనా’ వస్తువులను సైతం అమ్ముతున్న చైనా!

By:  Tupaki Desk   |   22 Jun 2020 9:00 PM IST
‘బాయ్ కాట్ చైనా’ వస్తువులను సైతం అమ్ముతున్న చైనా!
X
‘బాయ్ కాట్ చైనా’.. ‘బాయ్ కాట్ చైనా వస్తువులు’ అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో చైనాకు వ్యతిరేకంగా భారతీయులంతా పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. గాల్వన్ లోయలో హింసాత్మక ఘర్షణల తరువాత 20 మంది భారత ఆర్మీ సైనికుల ప్రాణాలను తీసిన చైనాపై పగ ప్రతీకారాలతో భారతీయులు రగిలిపోతున్నారు.. చైనా వస్తువుల నిషేధంతో ఆ దేశానికి ఆర్థికంగా నష్టం చేసేలా ఒక గుణపాఠం నేర్పించే పనిలో పడ్డారు.

భారత్ కు పెద్ద ఎత్తున తన వస్తువులను ఎగుమతి చేసే చైనా కంపెనీలు ఈ ఉద్రిక్తతలలోనూ తమకు అనుకూలమైన వ్యాపారంగా మలుచుకుంటుండడం విశేషం. తాజాగా చైనీస్ దుస్తుల కంపెనీలు బాయ్ కాట్ చైనా నినాదంతో టోపీలు మరియు టీ-షర్టుల తయారీ ప్రారంభించాయి. ఈ ఉత్పత్తులు భారతదేశంలోని ఇ-కామర్స్ ద్వారా భారత మార్కెట్లోకి డంప్ చేస్తున్నాయి. ఇవి చైనా వస్తువులే అని తెలియక ‘బాయ్ కాట్ చైనా’ అని ఉండడంతో భారతీయులకు ఎక్కువగా కొంటున్నారు. బాయ్ కాట్ చైనా అనే ముద్రించి ఉన్న క్యాప్స్ మరియు టీ-షర్ట్‌లను వెనుకాల తెరిచి చూడగా అందులో ‘మేడ్ ఇన్ చైనా’ అని ఉండడంతో కొన్నవారు అవాక్కవుతున్నారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు, చైనా ఉత్పత్తులను బహిష్కరించడం వల్ల చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కంటే భారత ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఆర్థిక నిపుణుల విభాగం అభిప్రాయపడింది. భారతీయ దిగుమతులు - ఎగుమతులను నిలిపివేయడం లేదా భారీ ఆంక్షలు విధించడం వంటి చేస్తే చైనా కూడా అలానే చేస్తే భారత్ కే నష్టం అంటున్నారు. చైనా స్థానంలో భారతదేశం విశ్వసనీయ వాణిజ్య భాగస్వామిని కనుగొనే వరకు భారత ఆర్థిక వ్యవస్థకు చైనా చీప్ వస్తువులు అవసరమే అని నిపుణులు అంటున్నారు.

చైనా ఎగుమతుల్లో భారతదేశం వాటా 3 శాతం మాత్రమే. అదే క్రమంలో చైనా నుండి 70 బిలియన్ డాలర్ల వస్తువులను భారతదేశం దిగుమతి చేస్తుంది. 60 శాతం ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇందులో ఉన్నాయి. చైనా నుండి 67 శాతం ఫార్మా ముడిపదార్థాల దిగుమలు భారత్ కు మందుల తయారీలో ఎంతో లాభం చేకూరుస్తున్నాయి. అలాగే, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 16.7 బిలియన్ డాలర్ల ఎగుమతులతో చైనా దేశం ఏకంగా భారత్ కు మూడవ అతిపెద్ద మార్కెట్ గమ్యస్థానంగా ఉంది.