Begin typing your search above and press return to search.

మ‌న ఆర్మీ యుద్ధం పేరెత్త‌గానే..చైనాలో వ‌ణుకు

By:  Tupaki Desk   |   8 Sept 2017 1:22 PM IST
మ‌న ఆర్మీ యుద్ధం పేరెత్త‌గానే..చైనాలో వ‌ణుకు
X
గ‌త‌వారం వ‌రకు మ‌న‌దేశంతో యుద్ధం చేసేందుకు తెగ ఉత్సాహం ప్ర‌ద‌ర్శించిన పొరుగుదేశం చైనా ఇప్పుడు నెమ్మ‌దించింది. శాంతివ‌చ‌నాలు వ‌ల్లిస్తోంది. ఇంత‌కూ ఇలా కొత్త మంత్రం జ‌పించ‌డం వెనుక మ‌ర్మం భార‌త సైన్యం చేసిన దిమ్మ‌తిరిగే ప్ర‌క‌ట‌నే. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్ మాట్లాడుతూ భారత్‌ యుద్ధానికి సిద్ధం కావాలి అని వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో చైనా ఉలిక్కి ప‌డింది. ఇదేంటి అంటూ చిర్రుబుర్రులాడింది.

న్యూఢిల్లీలోని 'భూభాగాల కోసం జరిగే యుద్ధాల అధ్యయన కేంద్రం(సిఎల్‌ డబ్ల్యుఎస్‌)' ఇటీవల నిర్వహించిన ఓ సెమినార్‌ లో రావత్‌ మాట్లాడుతూ ''రెెండు వైపులా ఒకేసారి యుద్ధం చేసేందుకు భారత సైన్యం సిద్ధపడాలి. భారత్‌ చేతిలో పాక్‌ బలగాలకు ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో ఆ దేశానికి అండగా నిలిచేందుకు చైనా సిద్ధంగా లేదు. దీంతో స్వయంగానే దాడులు నిర్వహించేందుకు చైనా ప్రయత్నిస్తోంది'' అని అన్నారు. బిపిన్‌ రావత్‌ వ్యాఖ్యలను తప్పు పట్టాల్సి వస్తోందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్‌ షువాంగ్‌ అభిప్రాయపడ్డారు.``భారత్‌ లోని కొంత మంది ద్వారా మాకు ఈ సమాచారం అందింది. మీడియా కూడా రావత్‌ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే ఆ వ్యాఖ్యలు ఆయన ప్రభుత్వాధికారి హోదాలో చేశారా? లేదా వ్యక్తిగత హోదాలో చేశారా? రావత్‌ దీనికి కట్టుబడి ఉన్నారా? వంటి అంశాలపై స్పష్టత కావాలి'' అని తెలిపారు.

బ్రిక్స్‌ సదస్సుకు హాజరైన సందర్భంగా మోడీ - జిన్‌ పింగ్‌ ల మధ్య శాంతి స్థాపన కోసం చర్చలు జరిగాయని, ఈ నేపథ్యంలో రావ‌త్ వ్యాఖ్య‌లు స‌రికావ‌న్నారు. ``రెండు రోజుల క్రితం మోడీ - జిన్‌ పింగ్‌ లు పరస్పరాభివృద్ధికి సహకరించుకునేందుకు అంగీకరించారు. తప్పితే నాశనం చేసుకోవడానికి కాదు. చైనా అభివృద్ధిని సక్రమ మార్గంలో హేతుబద్ధతో అర్థం చేసుకోవాలని, సాయం పొందుతూ సాయం చేద్దామనే సందేశాన్ని చైనా - భారత్‌ లు ప్రపంచానికి ఇవ్వాలి`` అని జెంగ్‌ కాంక్షించారు. ఇరు దేశాలు పరస్పరం గౌరవించుకోవాలని - విభేదాలు పక్కనపెట్టి సరిహద్దు ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలని జెంగ్‌ చెప్పారు. ''మనం శత్రువులమనే భావాన్ని తొలగించి, పరస్పరాభివృద్ధికి సహకరించుకుందాం. భారత భద్రతా దళాలు దీన్ని గుర్తెరిగి, ఇరు దేశాల మధ్య పటిష్ట బంధం ఏర్పడేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నాను'' అని జెంగ్‌ పేర్కొన్నారు. కాగా, మూడు దేశాల సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్‌ వివాదంలో యుద్ధం గురించి మున్ముందుకు ఉరికిన చైనా ఇప్పుడు శాంతివ‌చ‌న‌లు ప‌ల‌క‌డం ఆస‌క్తికగా ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.