Begin typing your search above and press return to search.

చైనా పెద్ద దొంగ అని సర్టిఫై చేసిన ట్రంప్

By:  Tupaki Desk   |   19 Feb 2016 4:53 AM GMT
చైనా పెద్ద దొంగ అని సర్టిఫై చేసిన ట్రంప్
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని తెగ తహతహలాడిపోతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన మాటలతో అగ్గి పుట్టించే ఆయన.. చైనాపై తనకున్న ద్వేషాన్ని ఏమాత్రం దాచుకోకుండా బయటపెట్టేశారు. రిపబ్లికన్స్ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగాలని తపిస్తున్న ఆయన.. తాజాగా ఒక మీటింగ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చైనాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చైనా ఓ పెద్ద దొంగగా అభివర్ణించిన ట్రంప్.. తన కరెన్సీ అయిన యువాన్ ను తగ్గించి అమరికాను దెబ్బ తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రత్యర్థి దేశమైన చైనాతో పాటు.. మిత్రదేశమైన జపాన్ ను కూడా ఆయన విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెట్టటం గమనార్హం. జపాన్ సైతం.. తన కరెన్సీ విలువను తగ్గించటం ద్వారా అమెరికా ప్రయోజనాలకు దెబ్బ తగిలినట్లుగా వ్యాఖ్యానించారు.

జపాన్ తన యెన్ విలువను తగ్గించటంతో.. అమెరికా కంపెనీలు ఆ దేశపు కంపెనీలతో పోటీ పడలేకపోయినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. పోలీసు ఎవరినైనా నిందితుడ్ని విచారణ సందర్భంగా హింసకు ట్రంప్ ఓకే చెప్పటం గమనార్హం. విచారణ సందర్భంగా వాటర్ బోర్డింగ్ వల్ల ప్రయోజనం ఉంటుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. విలక్షణతకు., వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన ట్రంప్ తాజా మాటలకు అమెరికన్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.