Begin typing your search above and press return to search.

చైనా తొండి వాదన..భారత ఎఫ్ డీఐ సవరణలు వివక్షపూరితమట!

By:  Tupaki Desk   |   20 April 2020 9:30 PM IST
చైనా తొండి వాదన..భారత ఎఫ్ డీఐ సవరణలు వివక్షపూరితమట!
X
నిజమే... ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ముద్రపడిపోయిన అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టేసి ఆ ప్లేస్ లోకి తాను వచ్చేయాలని డ్రాగన్ కంట్రీ చైనా ఎప్పటి నుంచో చేయని యత్నమంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ నిబంధనలకు తూట్లు పొడవడమే కాకుండా ఉగ్రవాదులకు కాణాచిగా మారిన పాకిస్థాన్ కు కూడా చేయిచ్చేందుకూ చైనా వెనుకాడని వైనం కూడా మనం చూస్తున్నదే. తాజాగా కరోనా వైరస్ విశ్వవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న వేళ... ఆ వైరస్ ను చైనానే ఉద్దేశపూర్వకంగానే వదిలిందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను ఓ వైపు ఖండిస్తూనే... తనది కాని భూభాగంలో చైనా తన జెండాను పాతేయడానికి చేస్తున్న యత్నాలు విస్తుగొలిపేవే. ఇందులో భాగంగానే... కరోనా వేళ తన భూభాగంలోని కంపెనీలు విదేశాల బారిన పడకుండా భారత్ తీసుకున్న చర్యలను చైనా తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ఈ తరహా తన వైఖరిని ఇతర దేశాలు ఏమనుకుంటాయోనన్న కనీస ఇంగితం కూడా లేకుండా చైనా చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే కలకలం రేపుతున్నాయి.

ఈ దిశగా చైనా తన అసలు రూపాన్ని ఎలా బయటపెట్టుకున్నదన్న విషయానికి వస్తే.. కరోనా వేళ ఆర్థిక రంగం చికితిపోతున్న వేళ... తన దేశీయ కంపెనీలపై విదేశీ హస్తాలు పడకుండా ఉండేందుకు భారత్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీఐ)కు సంబంధించి కీలక సవరణలు చేసింది. భారత్‌ తో సరిహద్దులు పంచుకునే దేశాల్లోని కంపెనీలు భారత్ కు చెందిన పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ - విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పాలసీకి సవరణలు చేస్తూ గత శనివారం నరేంద్ర మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో దేశంలోని కంపెనీల్లో చైనా సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టి సదరు కంపెనీలను చైనా టేకోవర్ చేయడాన్ని నిలిపివేసే దిశగా భారత్ ఈ సవరణలు చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సవరణల కారణంగా భారత్ లోని సంస్థల్లో దేశీయ సరిహద్దులను పంచుకుంటున్న దేశాలు నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి లేదు. ఒకవేళ మన కంపెనీల్లో ఆయా దేశాలు పెట్టుబడులు పెట్టాలంటే... భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.

భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా భారత నిర్ణయాన్ని తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత ఎప్ డీఐ సవరణలు... WTO సూత్రాలను ఉల్లంఘించినట్లు చైనా ఆరోపించింది. అంతేకాకుండా భారత్ చేసిన సవరణలు...వివక్ష ఉండకూడదన్న WTO సూత్రాలు - ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్ కు వ్యతిరేకంగా ఉన్నట్లు చైనా ఆరోపించింది. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని వివక్షతో కూడుకొన్నదిగా అభివర్ణించింది. సవరణలను పున:పరిశీలించాలని కూడా చైనా డిమాండ్ చేసింది. అయినా భారత్ తన కంపెనీలను కాపాడుకునేందుకే తీసుకున్న ఈ సవరణలపై చైనా ఎందుకు మండిపడుతోందన్న విషయానికి వస్తే... భారత్ లోని ప్రేవేట్ బ్యాంకుల్లో కీలక బ్యాంకుగా ఉన్న హెచ్ డీఎఫ్ సీలో ఇటీవల చైనా బ్యాంక్ 1.01 శాతాన్ని కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. అయితే ఈ చర్చలు జరుగుతుండగానే కరోనా విజృంభించడంతో ఈ చర్చలు వాయిదా పడిపోయాయి. అయితే ఈ సమయంలోనే తన కంపెనీలను కాపాడుకునేందుకు భారత్ తన ఎఫ్ డీఐ నిబంధనలను సవరించేసింది. సవరించిన నిబంధనల కారణంగా హెచ్ డీఎఫ్ సీలో 1.01 వాటాను చైనా కొనుగోలు చేయాలంటే... కేంద్రం అనుమతి తప్పనిసరి. ఈ విషయం తెలుసుకున్న మీదటే చైనా తనదైన నైజాన్ని బయటపెట్టుకొందన్న వాదనలు వినిపిస్తున్నాయి.