Begin typing your search above and press return to search.

అమెరికా, జ‌పాన్‌ల్లో అంతా న‌పుంస‌కులేన‌ట‌

By:  Tupaki Desk   |   14 July 2016 6:14 PM GMT
అమెరికా, జ‌పాన్‌ల్లో అంతా న‌పుంస‌కులేన‌ట‌
X
ద‌క్షిణ చైనా స‌ముద్రంపై అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పుపై చైనా అధికారిక మీడియా ఎక్క‌డ‌లేని అక్క‌సు వెళ్ల‌గ‌క్కింది. ఈ క్ర‌మంలో హేగ్ ట్రిబ్యున‌ల్ తీర్పును అమ‌లు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న అమెరికా, జపాన్‌ల‌పై విరుచుకుప‌డింది. ఆ రెండు దేశాలు నపుంస‌కులు, కాగితం పులులు అంటూ విమ‌ర్శించింది. ద‌క్షిణ చైనా స‌ముద్రంలో అమెరికా వార్‌షిప్స్‌ను దించితే వాటికి త‌గిన బుద్ధి చెప్ప‌డానికి సిద్ధంగా ఉండాల‌ని ఆర్మీకి పిలుపునిచ్చింది.

చైనా ప్ర‌భుత్వ ఆధీనంలో న‌డిచే గ్లోబ‌ల్ టైమ్స్ ప‌త్రిక ఈ మేర‌కు ఓ ఎడిటోరియ‌ల్ రాసింది. ఈ సంద‌ర్భంగా పాత చైనా సామెత‌ను గుర్తుచేసింది. పాల‌కునికి లేని ఆందోళ‌న న‌పుంస‌కునికి ఉంటుంద‌న్న‌ట్లు ఈ విష‌యంలో ప్ర‌తివాది అయిన ఫిలిప్పైన్స్ దీనిపై కామ్‌గానే ఉన్నా అమెరికా, జ‌పాన్ మాత్రం ఆ న‌పుంస‌క పాత్ర పోషిస్తున్నాయ‌ని ఆ ప‌త్రిక దుయ్య‌బ‌ట్టింది. ద‌క్షిణ చైనా స‌ముద్రంలో బ‌ల‌గాల‌ను దింపాల‌ని చూడ‌టాన్ని బ‌ట్టే అమెరికా ఆలోచ‌న ఏంటో తెలుస్తోంద‌ని వ్యాఖ్యానించింది. అమెరికా ఇలాగే రెచ్చ‌గొడితే చైనీస్ ఆర్మీ బ‌దులు చెప్పేందుకు సిద్ధంగా ఉండాల‌ని, ఈ మేర‌కు స్పార్ట్‌లీ దీవుల్లో బ‌ల‌గాల‌ను పెంచాల‌ని సూచించింది. త‌మ‌కైతే యుద్ధం చేయాల‌న్న ఉద్దేశం లేద‌ని, వాషింగ్ట‌న్‌కు అలాంటి ఆలోచ‌న ఉంటే మాత్రం తాము వెన‌క్కి త‌గ్గ‌బోమ‌ని హెచ్చ‌రించింది. ట్రిబ్యున‌ల్ తీర్పు న్యాయ వ్య‌వ‌స్థ‌ను అవ‌హేళ‌న చేసిన‌ట్లుగా ఉంద‌ని మ‌రో ప్ర‌భుత్వ పత్రిక చైనా డైలీ అభిప్రాయ‌ప‌డింది. చైనా ఎదుగుద‌ల‌ను చూసి అమెరికా ఓర్వ‌లేక‌పోతుంద‌ని, అందుకే దానికి అడ్డుప‌డాల‌ని చూస్తోంద‌ని ఆరోపించింది.