Begin typing your search above and press return to search.

చంద్రుడిపై చైనావోడి సంచ‌ల‌నం!

By:  Tupaki Desk   |   4 Jan 2019 5:11 AM GMT
చంద్రుడిపై చైనావోడి సంచ‌ల‌నం!
X
మ‌న ప‌క్క‌నుండే చైనా అద్భుత‌మే చేసింది. అంత‌రిక్ష ప్ర‌యోగంలో అగ్ర‌రాజ్యాలైన అమెరికా.. ర‌ష్యాల‌కు.. ఆ మాట‌కు వ‌స్తే ప్ర‌పంచంలో మ‌రే దేశం చేయ‌ని ప‌నిని చైనా చేసింది. అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల్లో అద్భుత విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ప్ర‌పంచంలో మొట్ట‌మొద‌టిసారిగా చైనా ఆవ‌ల ఏముంద‌న్న విష‌యాన్ని ప‌రిశోధించ‌ట‌మే కాదు.. అక్క‌డ‌కు ఒక వ్యోమ‌నౌక‌ను దింపి హాట్ టాపిక్ గా మారింది.

చైనా ఇతిహాసాల్లోని చాంగే పేరుతో ఈ వ్యోమ‌నౌక‌ను చంద్రుడిపైకి ప్ర‌యోగించారు. ఇది విజ‌య‌వంతంగా చంద్రుడి ఆవ‌ల వైపు ల్యాండ్ కావ‌ట‌మే కాదు.. అద్భుత‌మైన ఫోటోల్ని భూమి మీద‌కు పంపింది. ఇంత‌కూ చంద్రుడి ఆవ‌ల వైపు ఏమిటి? అందులో ఏం ఉంటుంది? అన్న‌ది చూస్తే.. భూమికి.. చంద్రుడికి మ‌ధ్య గురుత్వాక్ష‌ర్ష‌ణ బంధ‌నం ఉంటుంది. దీని కార‌ణంగా చంద్రుడి ప‌రిభ్ర‌మ‌ణ కాలం.. భ్ర‌మ‌ణ‌కాలం ఒకేలా ఉంటుంది.

ఈ కార‌ణంతో భూమికి అభిముఖంగా ఉండి చంద్రుడికి సంబంధించిన ఒకే భాగాన్ని చూసే అవ‌కాశం ఉంది. రెండో భాగం ఎప్ప‌టికీ కంటికి క‌నిపించ‌ని ప‌రిస్థితి. ఈ భాగానికి ఫార్ సైడ్ గా పేర్కొంటారు.మామూలు భాష‌లో చెప్పాలంటే చంద్రుడిలోని చీక‌టి భాగంగా ప‌లువురు అభివ‌ర్ణిస్తుంటారు. ఈ భాగాన్ని తొలిసారి ర‌ష్యాకు చెందిన లూనా-3 వ్యోమ‌నౌక తొలిసారి ఫోటో తీసింది. ఇదంతా 1959లో జ‌రిగింది. ఆ త‌ర్వాత ప‌లు వ్యోమ‌నౌక‌లు ఫోటోలు తీసినా.. అందులోకి వెళ్లింది మాత్రం లేదు.

ఆ కొర‌త‌ను తీరుస్తూ చైనా తాజా ప్ర‌యోగం స‌క్సెస్ అయ్యింది. చంద్రుడిలోని చీక‌టి భాగంలోకి చాంగే-4 ల్యాండింగ్ విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. ఈ విజ‌యాన్ని నాసాతో పాటు.. ర‌ష్యా శాస్త్ర‌వేత్త‌లు చైనాకు ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు.

ఇప్ప‌టివ‌ర‌కూ వ్యోమ‌నౌక‌ను ఎందుకు పంప‌లేదన్న‌ది చాలామందిలో వ‌చ్చే సందేహం. చంద్రుడి అవ‌త‌లి భాగంలో క‌మ్యునికేష‌న్ అన్నింటికి మించిన పెద్ద స‌మ‌స్య‌. ఎందుకంటే రేడియో త‌రంగాల ప్ర‌సారానికి చంద‌మామే అడ్డండి. ఈ కార‌ణంతోనే అమెరికా వ్యోమోగాములు చంద్రుడి క‌క్ష్య‌లో తిరుగుతూ.. చంద్రుడి అవ‌త‌ల భాగానికి వెళ్లారు. ఆ స‌మ‌యంలో వారితో రేడియో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ స‌మ‌స్య‌ను అథిగ‌మించేందుకు వీలుగా ప్ర‌త్యేక ఉప‌గ్ర‌హాన్ని చైనా ప్ర‌యోగించింది.

దీంతో.. చైనా తాజా ప్ర‌యోగం స‌క్సెస్ కావ‌టానికి అవ‌కాశం క‌లిగింది. ఇంత‌కీఈ ప్ర‌యోగం ల‌క్ష్య‌మేంటి? ఏం చేయ‌నున్నారన్న విష‌యాల్లోకి వెళితే.. త‌క్కువ పౌనఃపున్య‌మున్న రేడియో త‌రంగాల‌ను ప‌రిశీలించి.. విశ్వానికి సంబంధించిన నిగూఢ అంశాల్ని తెలుసుకోవ‌టం ఈ ప్ర‌యోగం అస‌లు ల‌క్ష్యంగా చెప్పాలి. కృత్రిమంగా వెలువడే రేడియో త‌రంగాల‌ను అధ్యయ‌నం చేయ‌టం ఇంకో ల‌క్ష్యం.

వీటితో పాటు చంద్రుడి ఉప‌రిత‌లాన్ని శోధించ‌టం.. అక్క‌డి ఖ‌నిజాల తీరుతెన్నుల‌ను తెలుసుకోవ‌టం తాజా ప్ర‌యోగంలోని మ‌రో అంశంగా చెప్పాలి. తాజా ప్ర‌యోగంలో భాగంగా మినీ జీవావ‌ర‌ణ ప్ర‌యోగంలో భాగంగా కొన్ని బంగాళ దుంప‌లు.. కొన్ని మొక్క‌ల విత్త‌నాలు.. ప‌ట్టుపురుగు గుడ్ల‌ను పంపారు. వీటి ఆధారంగా త‌క్కువ గురుత్వాక‌ర్ష‌ణ‌.. అధిక రేడియో ధార్మిక‌త ఉన్న చంద్రుడి ఉప‌రిత‌లంపై శ్వాస‌క్రియ.. కిర‌ణ జ‌న్య సంయోగ క్రియ ఎలా జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని ప‌రిశీలించాల‌న్న ఉద్దేశ్యంతో తాజా ప్ర‌యోగాన్ని చేప‌ట్టిన‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. ప్ర‌పంచంలో తోపులు అన్న దేశాల‌కు సాధ్యం కాని ప్ర‌యోగాన్ని చైనావోడు చేత‌ల్లో చేసి చూపించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.