Begin typing your search above and press return to search.

భార‌తీయుల‌కు చైనా చెప్పిన తీపి క‌బురు ఇదే!

By:  Tupaki Desk   |   23 Aug 2022 6:38 AM GMT
భార‌తీయుల‌కు చైనా చెప్పిన తీపి క‌బురు ఇదే!
X
రెండేళ్ల క్రితం చైనాలోని వూహాన్‌లో కోవిడ్ వైర‌స్ వెలుగుచూసి ప్రపంచ దేశాల‌ను అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో భార‌తీయ విద్యార్థుల‌ను చైనా స్వ‌దేశానికి పంపించేసింది. భార‌త విద్యార్థులు అత్య‌ధికంగా విద్య‌న‌భ్య‌సిస్తున్న దేశాల్లో చైనా కూడా ఒక‌టి. ముఖ్యంగా వైద్య విద్య కోర్సులు చ‌ద‌వ‌డం కోసం భార‌తీయ విద్యార్థులు ఎక్కువ‌గా చైనాకు వెళ్తున్నారు. స్వ‌దేశంలో కంటే త‌క్కువ‌గా ఎంబీబీఎస్ కోర్సు పూర్త‌వ్వ‌డంతో చైనా భార‌తీయ విద్యార్థుల‌ను ఆక‌ర్షిస్తోంది.

కాగా గ‌త రెండేళ్ల నుంచి కోవిడ్ విజృంభించ‌డంతో భార‌తీయుల‌కు చైనా వీసాలు నిలిపేసింది. వీరిలో చైనాలో చ‌దువుకుంటున్న విద్యార్థుల‌తోపాటు వ్యాపార‌వేత్త‌లు, చైనాలో ప‌నిచేస్తున్న భార‌తీయుల కుటుంబ స‌భ్యులు ఉన్నారు. ఈ నేప‌థ్యంలో చైనా ప్ర‌భుత్వం భార‌తీయుల‌కు శుభ‌వార్త చెప్పింది. వీరింద‌రికీ తిరిగి వీసాల‌ను జారీ చేసే ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌లో ప్రారంభిస్తామ‌ని తాజాగా తెలిపింది.

ఈ మేరకు చైనా విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన ఏషియన్‌ అఫైర్స్‌ విభాగం కౌన్సిలర్‌ జీ రాంగ్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు. ''భారత విద్యార్థులకు శుభాకాంక్షలు. మీ ఓపిక సత్ఫలితాలను ఇచ్చింది. చైనాకు తిరిగి స్వాగతం'' అని ఆయ‌న త‌న ట్వీటులో పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం కూడా ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

చైనాలో ఉన్నత విద్య అభ్య‌సించాల‌నుకునే విద్యార్థులకు ఎక్స్‌1-వీసాను చైనా జారీ చేస్తోంది. ప్రస్తుతం చైనాలో వైద్యవిద్యను అభ్యసిస్తున్న సుమారు 23 వేల మంది భారత విద్యార్థులు, తిరిగి చైనా వెళ్లేందుకు వేచిచూస్తున్నట్లు చెబుతున్నారు.

కాగా కొత్తగా చైనాలో చేరే భార‌త విద్యార్థులు తమ అడ్మిషన్‌ లేఖను, తిరిగి వచ్చేవారు వర్సిటీ ఇచ్చిన 'రిటర్నింగ్‌ టు క్యాంపస్‌' ధ్రువపత్రాన్ని చూపించాల్సి ఉంటుందని చైనా తెలిపింది. మ‌రోవైపు కోవిడ్ క‌ల్లోలం మొద‌ల‌యిన‌ప్ప‌టి నుంచి భారత్‌ నుంచి చైనాకు సరాసరి విమానాలు లేకపోవడం విద్యార్థులకు మరో సమస్యగా మారింది.

గ‌త రెండేళ్లలో తొలిసారిగా భారత వ్యాపారవేత్తలు ఒక చార్టర్డ్‌ విమానంలో తమ కుటుంబాలతో సహా ఇటీవల చైనాకు చేరుకోవ‌డ‌మే. ఇక చైనాలో పనిచేస్తున్నవారి కుటుంబీకులు ఇతర దేశాల నుంచి మరింత అదనంగా ఖర్చుపెట్టి ఇతర దేశాల మీదుగా చైనాకు చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఇరు దేశాల మధ్య విమానాల రాక‌పోక‌ల‌ను ప్రారంభించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో తిరిగి తమ విద్యను కొనసాగించేందుకు వీలు కలుగుతుందని విద్యార్థులు ఆశాభావంతో ఉన్నారు