Begin typing your search above and press return to search.

డ్రాగన్ కు కరోనా ఎంత దెబ్బేసిందో తెలుసా?

By:  Tupaki Desk   |   6 Feb 2020 5:30 AM GMT
డ్రాగన్ కు కరోనా ఎంత దెబ్బేసిందో తెలుసా?
X
ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరించే అమెరికాకు సైతం కొరుకుడుపడని దేశంగా చైనాను చెప్పక తప్పదు. 150 కోట్ల జనాభా.. 13.6 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో కళకళలాడే చైనాకు సంబంధించి మరో కీలకాంశం.. కమ్యునిస్టుల ఏలుబడిలో ఆ దేశంలో ఏం జరుగుతుందో బయటకు పొక్కని పరిస్థితి. డ్రాగన్ దేశంగా అభివర్ణించే చైనా.. పేరుకు తగ్గట్లే తరచూ బుసలు కొడుతూ ఉంటుంది. ఆ దేశానికి ఉన్నంత పొగరు.. బలుపు అంతా ఇంతా కాదన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది.

చైనాను అడ్డుకోవటం.. ఎదురెళ్లటమంటే మామూలు విషయం కాదనుకునే వేళ.. ఇలాంటి బలుపు లెక్కల్ని ప్రకృతి సెట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆ మాట మరోసారి నిజమైంది. కంటికి కనిపించని బుల్లి వైరస్ కరోనా. కానీ.. దాని ధాటికి డ్రాగన్ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. లక్షలాది మంది కరోనా బారిన పడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతుంటే.. పదుల సంఖ్యలో ఈ వైరస్ కారణంగా మరణాలు నమోదవుతున్నాయి. జాతీయ అత్యవసర పరిస్థితి వేళ.. ఆ దేశం ఆరోగ్య పరంగానే కాదు.. ఆర్థికం గానూ తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతోంది.

కరోనా వైరస్ భయంతో చైనాకు సన్నిహితంగా వ్యవహరించే దేశాలు సైతం పలు ఆంక్షల్ని విధించటంతో పాటు.. ఆ దేశానికి తమ విమాన రాకపోకల్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవటంతో ఆ రంగం మీద తీవ్ర ప్రభావానికిగురయ్యే పరిస్థితి. కరోనా ప్రభావం చైనా మీద ఎంతంటే.. ఈ వైరస్ కు ముందు ఆ దేశ వృద్ధి రేటు 6.1 శాతంగా ఉంటే.. అది కాస్తా తాజా పరిణామాల కారణంగా 5.6 శాతానికి పడి పోవటం ఖాయమన్న లెక్కలు వినిపిస్తున్నాయి.

చైనాలోని బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తుల్ని నిలిపివేశాయి. ప్లాంట్లను మూసివేశాయి. దీంతో.. తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతోంది చైనా. పలు కంపెనీలు తమ ప్లాంట్లను తాత్కాలికంగా మూసి వేయటం తో కోట్లాది మంది ఉపాధి అవకాశాల్ని కోల్పోతున్నట్లు చెబుతుననారు. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు రెండు కోట్ల మంది వరకూ చైనాలో ఉపాధి అవకాశాల్ని కోల్పోయినట్లు గా చెబుతున్నారు.

కరోనా కారణంగా యావత్ దేశం స్తంభించిపోయిన పరిస్థితి. అదెంత? అంటే.. చైనాలో రోజువారీగా వినియోగించే చమురు 1.4 కోట్ల బ్యారెళ్లు. ఒక బ్యారెల్ అంటే 158.98 లీటర్లకు సమానం. అంటే రోజులో 222 కోట్లకు పైగా లీటర్లను వినియోగిస్తారు. ఇదెంత ఎక్కువ అంటే..యూకే.. ఫ్రాన్స్.. జర్మనీ.. ఇటలీ.. స్పెయిన్.. జపాన్.. దక్షిణ కొరియా లాంటి దేశాలన్నింటిలోనూ ఒక రోజులో ఎంత వినియోగిస్తాయో దాని కంటే ఎక్కువగా చైనా ఒక్క దేశమే వినియోగిస్తుందన్న మాట. అంత డిమాండ్ కాస్తా కరోనా దెబ్బకు పడిపోయింది. రోజువారీ వినియోగంతో పోలిస్తే.. 20 శాతం తక్కువగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చమురు ఉత్పత్తి చేసే దేశాలు.. తాము ఉత్పత్తి చేసే ముడి చమురు ఉత్పత్తి ని తగ్గించాలని నిర్ణయం తీసుకోవటం చూస్తే.. చైనా ప్రభావం ఎంతన్నది ఇట్టే అర్థం కాక మానదు.