Begin typing your search above and press return to search.

కరోనా ఆన‌వాళ్లు చెప్తే రూ.11.5లక్షల న‌జ‌రానా : చైనా

By:  Tupaki Desk   |   9 Nov 2021 11:30 PM GMT
కరోనా ఆన‌వాళ్లు  చెప్తే రూ.11.5లక్షల న‌జ‌రానా : చైనా
X
చైనాలోని హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్సు క‌రోనా వైర‌స్‌ పై ప్ర‌జాయుద్ధాన్ని ప్ర‌క‌టించింది. ర‌ష్యాతో స‌రిహ‌ద్దుల్లో ఉన్న హీహే న‌గ‌రం తాజాగా ఓ ప్ర‌క‌ట‌న చేసింది. కొత్త‌గా విజృంభిస్తున్న క‌రోనా వైర‌స్ ఆన‌వాళ్ల‌ను గుర్తిస్తే వారికి ల‌క్ష యువాన్లు (15,500 డాల‌ర్లు) ఇస్తామ‌ని ఆ న‌గ‌రం ప్ర‌క‌టించింది. ఎక్క‌డ నుంచి వైర‌స్ వ్యాపించింది, ఎలా ఆ వైర‌స్ ప్ర‌బ‌లుతోంద‌న్న అంశాల‌ను తేల్చేందుకు స్థానిక ప్ర‌భుత్వం ఆ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల చైనాలో డెల్టా వేరియంట్‌ కు చెందిన క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి.

దీంతో దేశ‌వ్యాప్తంగా మ‌ళ్లీ తీవ్ర స్థాయిలో ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించారు. ఈ నేప‌థ్యంలో వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు దాని ఆన‌వాళ్ల‌ను గుర్తించాల‌ని హీహే న‌గ‌రం భావిస్తోంది. దీనికి సంబంధించి ఆదివారం ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు సాధార‌ణ ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని, ద‌ర్యాప్తున‌కు ఆధారాలు స‌మ‌ర్పించాల‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో కోరారు. అతి విలువైన స‌మాచారాన్ని ఇస్తే, వైర‌స్ పుట్టుక గురించి తెలుస్తుంద‌ని ప్ర‌భుత్వం ఆ ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది. అయితే ఎవ‌రైనా కావాల‌నే స‌మాచారాన్ని దాచిపెడితే మాత్రం వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది.

జంతువుల స్మ‌గ్లింగ్‌, అక్ర‌మ వేట‌, స‌రిహ‌ద్దుల్లో చేప‌ల వేట‌కు వెళ్ల‌డం లాంటివి ఎవ‌రైనా చేస్తే, వాటి గురించి త‌క్ష‌ణ‌మే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం తెలిపింది. అక్టోబ‌ర్ ఒక‌టి త‌ర్వాత ఆన్‌ లైన్‌ లో వ‌స్తువులు కొన్న‌వారు, ఆ వ‌స్తువుల‌ను డిస్ ఇన్ ఫెక్ట్ చేయాల‌ని సూచించింది. వాటిని వైర‌స్ టెస్టింగ్ కోసం కూడా ప్ర‌భుత్వ సెంట‌ర్‌ కు పంపాల‌న్న‌ది. క‌రోనా మ‌హ‌మ్మారితో స‌త‌మ‌త‌మైన దేశాల నుంచి ఎటువంటి వ‌స్తువుల‌ను ఆన్‌ లైన్‌ లో కొనుగోలు చేయ‌వ‌ద్దు అని సూచించారు. లాజిస్టిక్స్‌, కొరియ‌ర్ కంపెనీలు తమ వ‌ద్ద‌కు వ‌చ్చిన పార్సిళ్ల‌ను ఒకేవ‌ద్ద ఉంచాల‌ని, వాటిని ప్ర‌భుత్వ అధికారులు త‌నిఖీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించాయి.