Begin typing your search above and press return to search.

చైనా తన బుద్ధిని చాటుకొంది..!

By:  Tupaki Desk   |   24 Jun 2015 6:20 AM GMT
చైనా తన బుద్ధిని చాటుకొంది..!
X
వింత ఏమీ లేదు. స్నేహానికంటూ చేయి చాస్తూనే చైనా తన బుద్ధిని చాటుకొంది. భారత్‌ పట్ల తన సహజమైన ధోరణిని అవలంభించింది. పాక్‌ పక్షపాతం చూపించింది. ఉగ్రవాద చర్యల విషయంలో ఐక్యరాజ్యసమితిలో చైనా పాక్‌కు మద్దతుగా నిలిచింది. ఐరాస ద్వారా పాక్‌పై కొంత ఒత్తిడిని అయినా తీసుకురావాలనుకొన్న భారత్‌ ప్రయత్నాలపై చైనా నీళ్లొదిలింది. తన పవర్‌ను ఉపయోగించుకొని ఇండియాను ఇబ్బందిపెడుతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే.. ముంబై పై ఉగ్రవాదుల దాడి సూత్రధారి లక్వీని పాకిస్తాన్‌ ప్రభుత్వం ఇటీవల వదిలిపెట్టిన సంగతి తెలిసిందే. జైలు నుంచి అతడిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈ చర్యపై భారత్‌ చాలా రోజులుగా నిరసన తెలుపుతూనే ఉంది.

భారత్‌లో ఉగ్రవాద కాండను సృష్టించిన వ్యక్తిని ఎలా వదిలిపెడతారు? అని ప్రశ్నిస్తూనే ఉంది. అయితే పాక్‌ నుంచి సరైన సమాధానం లేదు. తాజాగా ఈ విషయాన్ని భారత్‌ ఐరాసలో ప్రస్తావించింది. పాక్‌ చర్యలు ఉగ్రవాదానికి ఊతం ఇచ్చేవిలా ఉన్నాయని భారత అధికారులు వివరించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని... ఆంక్షల కమిటీకి ఫిర్యాదులు చేసింది.

ఇండియా ఫిర్యాదుల మేరకు ఐరాస ఆంక్షల కమిటీ ఈ అంశంపై చర్చలకు సమావేశం కూడా అయ్యింది. అయితే ఇక్కడే చైనా చక్రం తిప్పింది. పాక్‌కు ఇండియా సరిగా సమాచారం అందించలేదు.. అందుకే లక్వీ విడుదల అయ్యాడు, ఈ విషయంలో పాక్‌ తప్పేమీ లేదు అంటూ చైనా వాదించి ఆంక్షల కమిటీ చర్యలను నిలుపుదల చేసింది.

ఈ విధంగా డ్రాగన్‌ తన పక్షపాత బుద్ధిని చూపించింది. పాక్‌కు వత్తాసు పలికింది. మరి ఇలాంటి చైనానా మనం విశ్వసించేది?!