Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో బాల్య వివాహాలు పెరగడానికి కారణాలు ఇవే

By:  Tupaki Desk   |   26 March 2022 2:15 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో బాల్య వివాహాలు పెరగడానికి కారణాలు ఇవే
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే అందుకు కారణాలు మాత్రం ఆర్థిక అసమానతలు, నిరక్షరాస్యత, బాలికలను జాగ్రత్తగా పెంచలేమన్న భయం, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని బెంగలేనని ఐపీసీఎస్ అధికారులు వివరిస్తున్నారు. అయితే ఇది సరైన పద్ధతి కాదని మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న వీరు బాల్య వివాహాల నిరోధానికి ఎంతగానో కృషి చేస్తున్నారు.

ప్రతి నెల గ్రామ, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలికల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తున్నారు. చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల పిల్లలు ఎదుర్కొనే సమస్యల గురించి వివరిస్తున్నారు. అంతే కాదండోయ్ మీకు తెలిసిన వాళ్లలో ఎవరైనా బాల్య వివాహాలు జరిపిస్తుంటే 1098 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేయొచ్చని సూచిస్తున్నారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో 2015 నుంచి ఇప్పటి వరకు 6 వేల 600 బాల్య వివాహాలు ఆపినట్టు అధికారులు చెబుతున్నారు. అలాగే ఐదో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం.. 2019 నుంచి 21 వరకు 29.3 శాతం మహిళలకు 18 ఏళ్ల లోపే పెళ్లిల్లు అయిపోయినట్లు వివరిస్తున్నారు. అయితే ఇందులో 21.7 శాతం పట్టణ ప్రాంత ప్రజలు కాగా... 32.9 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారని వెల్లడించారు. వీరిలో 29.3 శాతం 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వారేనట. అంతే కాకుండా 19 ఏళ్లకు ముందే వారంతా గర్భం దాల్చినట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయి.

అదే తెలంగాణలో అయితే 2020లో బాల్య వివాహాలు 27 శాతం పెరిగాయి. ఫిబ్రవరి 2019 నుంచి మార్చి 2020 మధ్య 97 వివాహాలను ఆపినట్లు అధికారులు వివరిస్తున్నారు. ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 మధ్య 1355 పెళ్లిళ్లు ఆపారు. గతంలో నగర ప్రాంతాల్లో బాల్య వివాహాలు తక్కువగా జరిగేవి. కానీ కరోనా కాలంలో నగర ప్రాంతాల్లో కూడా బాల్య వివాహాలు భారీగానే జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అధికారికంగా విడుదల చేసిన నివేదిక లోనే ఇన్ని ఉంటే... ఇంకా బయటకు రాని బాల్య వివాహాలెన్ని ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బాల్య వివాహ నిషేధ చట్టం 2007 జనవరి 10 ఆమోదం పొంది నవంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం బాల్య వివాహాన్ని ప్రోత్సహించే వారితో పాటు చేసే వారికి రెండేళ్ల జైలు శిక్ష.. అలాగే లక్ష రూపాయల జరిమానా లేదా రెండూ విధించే హక్కు ఉంటుంది. బాల్య వివాహం చేయడం ద్వారా పిల్లలు ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సతమతం అవుతుంటారు. బాలికలు చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల తల్లీ బిడ్డలిద్దరికీ ప్రాణాపాయమే. అంతే కాదండోయ్ పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, పౌష్టికాహార లోపం, రక్తహీనత వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకే ఇప్పటికైనా బాల్య వివాహాలను అడ్డుకోండి. పిల్లలను హాయిగా, స్వేచ్ఛగా బతకనివ్వండి.