Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల ఎరపై కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్.. ‘కీ’ పాయింట్స్ ఇవే - 2

By:  Tupaki Desk   |   4 Nov 2022 5:32 AM GMT
ఎమ్మెల్యేల ఎరపై కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్.. ‘కీ’ పాయింట్స్ ఇవే - 2
X
- మేం సేకరించిన ఆధారాల్ని అన్ని రాష్ట్రాల డీజీపీలకు పంపుతున్నాం. నేరుగా ప్రధానమంత్రికి పంపుతున్నాం. వాళ్లు మాట్లాడుతూ.. నేరుగా ప్రధానమంత్రితోనే టచ్ లో ఉన్నామని వాళ్లు చెప్తున్నారు. ఈ ముఠా చెప్పే అంశాలన్నీ బయటకు రావాలి.మీకు కాంట్రాక్టులు ఇస్తాం అని చెప్పడానికి వీళ్ళు ఎవరు? ఈ రాజ్యాంగేతర శక్తుల వెనుక ఉన్నది ఎవరో తేల్చాలి.

- ఒక కేంద్రమంత్రి చెబుతాడు.. మీరు కూడా ఎమ్మెల్యేలను కలుపుకున్నారని. మేం రాజ్యాంగ బద్ధమైన నిబంధనలకు లోబడే, ఎమ్మెల్యేలను కలుపుకున్నాం. మేము ఎమ్మెల్యేలను కొనలేదు.. అభివృద్ధి కోసం కలుస్తామంటే కలుపుకున్నాం. నా ప్రభుత్వాన్ని కులగొడుతానంటే నేను చూస్తూ ఉరుకోవాలా?

- బీఎల్ సంతోష్ ను మొదట టచ్ చేస్తారు...తరువాత అమిత్ షా, నడ్డా ను కలుస్తారు తుషార్ అనే వ్యక్తి బేరం అంతా మాట్లాడారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూలుస్తే అందరం కలిసి కొట్లాడాం. గోడి, లేకపోతే ఈడీ అని సోమయాజి చెప్తున్నారు. ఈ ముఠా నాయకులు ఎవరు?ఈ ముఠాకు డబ్బులు ఎవరు సమకూర్చుతున్నారు? ఈ ముఠాకు సంబంధించిన అన్ని విషయాలు బయటకు రావాలి.

- ఢిల్లీ ఎయిమ్స్ లో సోమయాజి ఆఫీస్ ఉంది అంటున్నారు. ఈవీఎంలు ఉన్నంతవరకూ బీజేపీకి ఢోకాలేదని చెప్తున్నరు వీళ్లు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు 100 కోట్ల రూపాయల ఆఫర్ ఇస్తున్నారు. తమకు ఈ పని ఇది రోజువారీ పని అంటున్నారు. ఈ రాజ్యాంగేతర శక్తుల్లో భారత ప్రభుత్వం ఉన్నది.ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కొనసాగడానికి వీల్లేదు. నేను చేతులు జోడించి మనవి చేసుకుంటున్నా. భారత న్యాయ వ్యవస్థ ఇవన్నీ పరిశీలించాలి. దేశాన్ని కాపాడాలి. 2015 నుంచి ఈ 24మంది ముఠా వ్యవహారం.. ఈ ముగ్గురి ఫోన్ కాల్ డేటా అంతా బయటకు వచ్చింది. వీళ్ళ డేటా అంతా వేల పేజీలలో ఉంది. ప్రధానమంత్రి మోడీకి విజ్ఞప్తి చేస్తున్నా.. మీ రాజకీయ సహచరుడిగా చెప్తున్నా. దేశానికి రెండు సార్లు పీఎం అయ్యారు. ఇలాంటి రాజకీయాలను మీరు ఆపండి. ప్రధాని గారూ ఈ పద్ధతి మంచిది కాదు.. మీ స్థాయి తగ్గుతుంది.

- వెయ్యేండ్లు ఎవరూ బతికేది లేదు కదా. ఈ దుర్మార్గాన్ని మీరు ఆపాలి. ఇక నుంచైనా మీరు మంచిపేరు సాధించండి. అందరినీ పట్టుకొండి, చర్యలు తీసుకోండి. నాకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. అందుకే చేతులు జోడించి కోరుతున్నా.. ఈ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు జరపండి. నిష్పాక్షికంగా దర్యాప్తు చేపట్టండి. భారతదేశం ఇలాంటివి సహిందని చాటి చెప్పాలి. ఈ జాతి నష్టపోకుండా చూడాలి. దేశంలో ఇంకా న్యాయం బతికే ఉంది. దేశంలోని ప్రజాస్వామ్యవాదులు, మేధావుల్లారా.. బుద్ధిజీవుల్లారా.. ఈ దేశం మీది.. భవిష్యత్ మీది, దీన్ని కాపాడాలి.

- ప్రత్యేకంగా నేను న్యాయవ్యవస్థకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ దేశంలో ఎప్పుడు ప్రజాస్వామ్యానికి ప్రమాదం తలెత్తినా, ప్రజాస్వామ్యం తడబడినా న్యాయవ్యవస్థ సమర్థవంతమైన పాత్రను పోషించింది. నేను ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులందరికీ వినమ్రపూర్వకంగా చేతులు జోడించి ఈ దేశాన్ని రక్షించాలని కోరుతున్నాను. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. లేకపోతే ఈ దేశం ప్రమాదంలోకి నెట్టబడుతుంది. ఇది చాలా తీవ్రమైన సమస్య.

- ఈ రోజు నేను మీకు చూపించనున్న వీడియో సమాచారం తెలంగాణ రాష్ట్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలైన పోలీస్, ఏసిబి లు ఎంక్వైరీ చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాసిక్యూషన్ హైకోర్టుకు సమర్పించడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు సిబిఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడి), సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, పిటిఐ, ఎఎన్ఐ వంటి న్యూస్ ఏజెన్సీలకు ఈ వీడియోలను పంపిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు, అన్ని భాషలు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సంస్థలకు ఈ సమాచారాన్నిపంపించాం.

- దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల అధ్యక్షులకు ఈ వీడియోలను పంపించాం. రేపు ఉదయం లేదా మధ్యాహ్నం వరకు ఇవి చేరుకుంటాయి. గౌరవ ప్రధానమంత్రి గారికి నేను విన్నవిస్తున్నాను. నేను మీ రాజకీయ సహచరున్ని. మీరు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాను. నేను కూడా రాజ్యంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను.దీనికంటే ముందు కూడా నేను మీకు సలహాలు ఇచ్చాను. ఇవ్వాళ కూడా సలహాలిస్తున్నాను. ఈ దుశ్చర్యను, దాడిని ఆపండి. ప్రజాస్వామ్యాన్ని గౌరవాన్ని కాపాడండి. ఈ దాడి సరైనది కాదు. ఇది మీకు మంచి చేయదు. భారతదేశ చరిత్రలో మీ స్థానానికి నష్టం వాటిల్లుతుంది. వాస్తవాన్ని మీకు వెల్లడిస్తున్నాను.

- మీరు రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యారు. ఇంకా ఏం కోరుకుంటున్నారు. మంచి పనులు చేయండి. చరిత్రలో మంచి పేరు తెచ్చుకోండి. అసలేం జరుగుతోంది. మీరు ఈ ఘటనకు బాధ్యులైన ప్రతీ ఒక్కరిని అరెస్టు చేయించమని మీకు విన్నవిస్తున్నాను. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చుతూ, అందరినీ భయాందోళనలకు గురిచేస్తూ మీరు ఏం సాధించాలనుకుంటున్నారు?

- మీ పేరు, మీ హోంమంత్రి పేరు చెప్పి బాహాటంగా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? వీటిని ఆపండి. విద్యార్థులు, యువకులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఓసారి మహానీయుడైన జయప్రకాశ్ నారాయణ్ ను గుర్తుచేసుకోండి. ఇప్పుడు మరోసారి సమయం వచ్చింది.

- ఇప్పటికే దేశం కష్టాల్లో ఉంది. రూపాయి విలువ పడిపోతోంది. ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంది. పేదవారు కష్టాల్లో ఉన్నారు. ప్రతీ వస్తువు ధర పెరుగుతూనే ఉంది. నిరుద్యోగం పెరుగుతున్నది. అంతర్జాతీయ సూచీల ర్యాంకులు పడిపోతున్నాయి. దేశం పరువు పోతోంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇలాంటి నీతిమాలిన కార్యక్రమాలు పక్కన పెట్టి ఆ సమస్యల పై దృష్టి పెడితే దేశం బాగుపడతుంది కదా. ఇలాంటి ఎన్నో సంక్లిష్ట పరిస్థితుల్లో దేశ న్యాయవ్యవస్థ దేశాన్ని గాడిలో పెట్టడంలో సమర్థవంతమైన పాత్ర పోషించింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు గుర్తులను కేటాయించేందుకు న్యాయవ్యవస్థ ద్వారా కృషి చేశాను. ప్రజాస్వామ్యం పై నమ్మకమున్న ప్రతీ ఒక్కరు ఈ ఉద్యమంలో పాల్గొని దేశాన్ని రక్షించండి. అందరికీ ధన్యవాదాలు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.