Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఎంత కరకుగా.. కర్కశంగా ఉంటారో మరోసారి చేతల్లో చూపారా?

By:  Tupaki Desk   |   2 Nov 2022 3:43 AM GMT
కేసీఆర్ ఎంత కరకుగా.. కర్కశంగా ఉంటారో మరోసారి చేతల్లో చూపారా?
X
రాజకీయాల్లో ఉన్న వారికి కరకుతనం.. కర్కశత్వం ఇట్టే వంటబట్టేస్తుంది. గతాన్ని వదిలేసి.. వర్తమానాన్ని.. దాంతో భవిష్యత్తుకు కలిగే ప్రయోజనాల్ని మాత్రమే లెక్కలోకి తీసుకొని వ్యవహరించే తీరు కొందరు నేతల్లో కనిపిస్తూ ఉంటుంది. ఫర్లేదులే.. అన్న చిన్నపాటి ఛాన్సు తీసుకోవటానికి సుతారం ఇష్టపడని వైనం కొందరిలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి తీరుకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. సమకాలీన రాజకీయాల్లో అస్సలు మొహమాటపడకుండా.. ప్రత్యర్థులకు చిన్న అవకాశాన్ని మిగల్చకుండా వ్యవహరించటంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్న మాట ఎంత నిజమన్నది తాజాగా మరోసారి నిరూపితమైంది.

ఇవాల్టి రోజున కేసీఆర్ ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీనే. నిజానికి ఆమె కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయి.. దేనికైనా రెఢీ అంటే ఈ రోజున కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. తనకు లభించిన అవకాశాల్ని తెలివిగా వాడేసిన కేసీఆర్.. అవసరమైన సందర్భాల్లో భావోద్వేగాన్ని బయటకు తీయటం.. తాను అనుకున్న రీతిలో మిగిలిన రాజకీయ పార్టీలు వ్యవహరించేలా చేయటంలో ఆయన ప్లానింగ్ ను మెచ్చుకోవాల్సిందే.

రాజకీయాల్లో ఉన్న వారు.. అందునా కేసీఆర్ లాంటి వారు తమకు కలిగిన ప్రయోజనాల్ని అస్సలు గుర్తించరు. వారికి తమ రాజకీయమే ముఖ్యం. అంతే తప్పించి.. మిగిలిన అంశాలేవీ ముఖ్యం కాదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఒకప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఇంటికి విందుకు పిలిస్తే.. అబ్బురపడిపోయి.. తన కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లటమే కాదు.. ఆమె చేసిన మర్యాదకు తెగ ఖుషీ అయిపోయారు. అలాంటి కేసీఆర్.. ఇప్పుడు అదే సోనియమ్మ కుమారుడు రాహుల్ గాంధీ జోడో యాత్ర పేరుతో దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ కు.. ఆయన రాక సందర్భంగా స్వాగతం పలికేందుకు వీలుగా ప్రముఖ దినపత్రికల్లో పలువురు కాంగ్రెస్ నేతలు మొదటి పేజీని పూర్తిగా ప్రకటనగా మార్చేసే జాకెట్ యాడ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ప్రీమియం ధర చెల్లించేందుకు సిద్ధమయ్యారు.

ఇలాంటివేళ.. కేసీఆర్ సర్కారు మరో ఎత్తుగడ వేసింది. రాహుల్ జోడో యాత్రకు మీడియాలో భారీ కవరేజ్ ఇచ్చే దాన్ని కవర్ చేసేందుకు.. పేపర్ ను చూసినంతనే కనిపించకుండా ఉండేందుకు వీలుగా ఈ రోజు (బుధవారం) అన్ని ప్రముఖ దినపత్రికల మొదటి పేజీని తన నిలువెత్తు ఫోటోను పబ్లిష్ చేసుకోవటమే కాదు.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమ ప్రచారానికి వినియోగించారు.

సాధారణంగా ఇలాంటి చిన్న విషయాల్ని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారు పట్టించుకోరని భావిస్తాం. కానీ.. కేసీఆర్ రూటు సపరేటు. ప్రత్యర్థులకు ఏ చిన్న అవకాశాన్ని ఇవ్వరు. తాను ఈ రోజున ఈ స్థాయిలో ఉండేందుకు అవకాశం ఇచ్చిన వ్యక్తి కుమారుడు పాదయాత్రకు తమ రాష్ట్రానికి వచ్చిన వేళలోనూ.. దానికి సంబంధించిన మైలేజీ ప్రజల మనసులో రిజిస్టర్ కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం చూస్తే.. కరకుదనం.. అంతకుమించిన కర్కశత్వానికి ప్రతీకగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించటం కనిపిస్తోంది. వారి కోణంలో నుంచి చూస్తే.. ఈ వాదనలో నిజం ఉందనిపించక మానదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.