Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ బీహార్ టూర్‌.. కూపీ లాగుతున్న బీజేపీ రీజనేంటి?

By:  Tupaki Desk   |   31 Aug 2022 8:56 AM GMT
కేసీఆర్‌ బీహార్ టూర్‌.. కూపీ లాగుతున్న బీజేపీ రీజనేంటి?
X
గ‌త ఏడాది కాలంగా కేంద్రంలోని బీజేపీకి, తెలంగాణ అధికార పార్టీకి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొన్న విష‌యం తెలిసిందే. బీజేపీ అంటేనే .. ఇప్పుడు కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో భ‌గ్గున మండు తున్నారు. ఇక, కేసీఆర్ అంటే.. బీజేపీ పెద్ద‌లు కూడా.. అదే రేంజ్‌లో ఉన్నారు. ఆయ‌న‌ను అందిన కాడికి ఇబ్బందులు పెట్టాల‌నే వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్న‌ట్టు.. తాజాగా విద్యుత్ బ‌కాయిల విష‌యంలో ఇచ్చిన ఆదేశాల‌ను బ‌ట్టి స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే కేసీఆర్ స‌హా తెలంగాణ అధికార పార్టీ కీల‌క నేత‌ల‌పై కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు ఒక క‌న్నేసి ఉంచుతున్నారు. ఆయ‌న ఎవ‌రిని క‌లుస్తున్నారు? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాంటి వ్యూహాలు అనుస రించ‌నున్నారు? ఎవ‌రెవ‌రు ఆయ‌న‌కు సాయం చేసేందుకుముందుకు వ‌స్తున్నారు? అనే విష‌యాల‌పై నా.. బీజేపీ పెద్ద‌లు దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా కేసీఆర్ బీహార్ ప‌ర్య‌ట‌న‌పై కూడా ఢిల్లీ పెద్ద‌లు దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం.

ముఖ్యమంత్రి కేసీఆర్ బుధ‌వారం(ఆగ‌స్టు 31) బిహార్‌లో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బిహార్‌ పర్యటనకు బయలు దేరి వెళ్తారు. ఈ సందర్భంగా బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌తో భేటీ అవుతారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, తాజా రాజకీయాలు తదితర అంశాలపై ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు చర్చించనున్నారు.

గల్వాన్‌ లోయలో మరణించిన అయిదుగురు బిహార్‌ సైనికుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున కేసీఆర్ పరిహారం ఇస్తారు. అదేవిధంగా కొన్నాళ్ల కింద‌ట‌ సికింద్రాబాద్‌ టింబర్‌ డిపోలో చోటు చేసుకున్న ప్ర‌మాదంలో మరణించిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సీఎం కేసీఆర్ ఆర్థికసాయం అందించనున్నారు. అనంతరం నీతీశ్‌ నివాసానికి వెళ్లి అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. తర్వాత జాతీయ రాజకీయాలు, విపక్ష ప్రభుత్వాలపై బీజేపీ వైఖరి, తదితర అంశాలపై చర్చిస్తా రు.

బీజేపీకి ఉత్కంఠ‌ ఎందుకు?

కేసీఆర్ బీహార్ ప‌ర్య‌ట‌న‌పై బీజేపీకి ఎందుకు ఇంత ఉత్కంఠ‌? అనే ప్ర‌శ్న స‌హజంగానే తెర‌మీదికి వ‌స్తుంది. ఎందుకంటే.. నిన్న‌టి వ‌ర‌కు బీజేపీతో అంట‌కాగి... ప్ర‌భుత్వంలో చోటు కూడా క‌ల్పించిన బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ ఇటీవ‌ల బీజేపీకి ఝ‌ల‌క్ ఇచ్చారు. ప్ర‌భుత్వం నుంచి బీజేపీ గెంటేసి.. ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని.. నూత‌న‌స‌ర్కారు ఏర్పాటు చేశారు. అంతేకాదు.. మోడీపై తీవ్ర విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీయేత ర ప్ర‌భుత్వం ఏర్పాటు అత్య‌వ‌స‌ర‌మ‌ని.. అసెంబ్లీ సాక్షిగా ఆయ‌న గ‌త వారం చెప్పుకొచ్చారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇదే కాన్సెప్టుతో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. నితీష్‌తో భేటీ కానుండ‌డం బీజేపీకి ఉత్కంఠ‌గా మారింది. ఉత్త‌రాదిలో నితీష్‌కు గ‌ట్టి ప‌ట్టు ఉండ‌డం.. ఆయ‌న చెబితే.. ప్రాంతీయ పార్టీలు.. లైన్ క‌ట్ట‌డం.. వంటివి జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌-నితీష్ భేటీపై బీజేపీ చాలా నిశితంగా ప‌రిశీలిస్తోంద‌ని అంటున్నారు ఢిల్లీ రాజ‌కీయ విశ్లేష‌కులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.