Begin typing your search above and press return to search.

నకిలీ ఖాతాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

By:  Tupaki Desk   |   27 April 2021 4:30 AM GMT
నకిలీ ఖాతాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
X
తన పేరిట సోషల్ మీడియా ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌లో నకిలీ ఖాతా సృష్టించి సందేశాలను పోస్ట్ చేస్తున్నట్లు గుర్తించిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ సోమవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాన న్యాయమూర్తికి ట్విట్టర్ లేదా మరే ఇతర సోషల్ మీడియా ఖాతా లేదు. కానీ ట్వీట్టర్ లో జస్టిస్ ఎన్వీ రమణ పేరిట ఒక ఖాతా నుంచి సందేశాలు మాత్రం వెల్లువెత్తాయి. అది తనది కాదని.. ఎవరో చేస్తున్నారని గుర్తించి ఎన్వీ రమణ ఈ ఫిర్యాదు చేశారు.

జస్టిస్ ఎన్వీ రమణ పేరిట ఉన్న ఆ ట్విట్టర్ ఖాతా నుంచి నిన్న తొలగించిన ట్వీట్ ఇలా ఉంది "అజిత్ దోవల్ దౌత్యం కారణంగా, భారతదేశానికి ముడి పదార్థాలను సరఫరా చేయాలని అమెరికా నిర్ణయించింది.’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నేను చేయలేదని రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇటీవలే కోవిషీల్డ్ కరోనావైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన ముడి పదార్థాల వనరులను వెంటనే భారత్ కు అందజేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చెప్పారు. ఫిబ్రవరిలో విధించిన ఆంక్షల నుండి వ్యాక్సిన్ ముడి పదార్థాలను విడుదల చేయాలన్న అమెరికా నిర్ణయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ తన అమెరికన్ కౌంటర్ జేక్ సుల్లివాన్‌తో మాట్లాడిన తరువాత తీసుకున్నారు. దీన్నే రమణ ట్వీట్ చేసినట్టు పేర్కొన్నారు. ఇది తాను చేయలేదని తాజాగా ఫిర్యాదు చేశారు.

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గత శనివారం అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ 48వ ప్రధాన న్యాయమూర్తిగా సీజేసీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన జస్టిస్ నూతలపతి వెంకట రమణ 2022 ఆగస్టు 26 వరకు దేశ అత్యున్నత న్యాయమూర్తిగా కొనసాగుతారు.