Begin typing your search above and press return to search.

అతి త్వరలో తెలంగాణ హైకోర్టు..?

By:  Tupaki Desk   |   16 Aug 2015 6:40 AM GMT
అతి త్వరలో తెలంగాణ హైకోర్టు..?
X
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పద్నాలుగు నెలలు అవుతున్నా.. ప్రత్యేక హైకోర్టు ఇంకా ఏర్పాటు చేయలేదన్న అసంతృప్తి తెలంగాణ రాష్ట్ర సర్కారుతో పాటు.. తెలంగాణవాదులకు ఉంది. రాష్ట్రం ఇచ్చేసిన తర్వాత.. హైకోర్టు ఏర్పాటుకు జాప్యం ఎందుకన్న విషయంపై ఇప్పటివరకూ కేంద్రం సంతృప్తికర సమాధానం ఇచ్చింది లేదు.

ఈ నేపథ్యంలో హైకోర్టు సాధనం కోసం ఆందోళనలు.. నిరసనలు వ్యక్తం కావటం తెలిసిందే. హైకోర్టు సాధన కోసం తెలంగాణ అధికారపక్షం లోక్ సభలోనూ పలుమార్లు ఆందోళన చేసింది. ఇస్తాం.. చేస్తామన్న మాటల హామే తప్పించి.. స్పష్టమైన కార్యాచరణ ఇంతవరకూ ప్రకటించింది లేదు. దీనిపై తెలంగాణవాదులు గుర్రుగా ఉంటున్నారు.

తాజాగా పంద్రాగస్టు వేడుకల సందర్భంగా హైకోర్టు వద్ద జెండా వందనం నిర్వహించిన హైకోర్టు తాత్కలిక ఇన్ ఛార్జ్ ప్రధానన్యాయమూర్తి జస్టిస్ భోస్లే ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ హైకోర్టు సాకారమయ్యే రోజు దగ్గర్లోనే ఉందన్న సంకేతాల్ని ఇచ్చారు.

తెలంగాణ హైకోర్టు కోసం ప్లకార్డులు చూపుతూ నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఆ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. కలలు సాకారమయ్యే రోజు దగ్గర్లోనే ఉందన్న ఆయన.. ‘‘త్వరలోనే ఒక మంచి వార్త వినొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. అంతా మంచిగా జరుగుతుందని.. అప్పటివరకూ అందరూ కలిసిమెలిసి ఉండి.. రెండు రాష్ట్రాలకు చెందిన లాయర్లు కలిసి ఉండటాన్ని అస్వాదించాలని ఆయన వ్యాఖ్యానించారు.

కొన్ని విషయాల్లో ఓర్పు చాలా అవసరమని.. అన్ని దారులు మూసుకుపోయాయని అనుకునే వరకూ వేచి ఉండాలని.. ఆ తర్వాత ప్రయత్నాలు చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటుపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇన్ ఛార్జ్ స్పందించటం చూస్తుంటే.. తెలంగాణవాదుల హైకోర్టు కల త్వరలో తీరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.