Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో మరో కుదుపు.. గళమెత్తిన సీనియర్

By:  Tupaki Desk   |   19 Nov 2020 10:30 AM IST
కాంగ్రెస్ లో మరో కుదుపు.. గళమెత్తిన సీనియర్
X
బీహార్ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పార్టీ ఖతమైందా? ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ సీనియర్ నేతలు గళమెత్తుతుంటే ఆ పార్టీ పరిస్థితి దిగజారుతోందని అర్థమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ పార్టీలోని సంస్థాగత లోపాలను సరిదిద్దుకోలేకపోతే కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం అసాధ్యమని కుండబద్దలు కొట్టారు.

ఇప్పుడు సిబల్ కు మద్దతుగా మరో సీనియర్ నేత గళమెత్తాడు. కాంగ్రెస్ లో టాప్ లీడర్ గా కొనసాగే చిదంబరం సైతం పార్టీ వ్యవహారాలపై పెదవి విరిచాడు. కపిల్ సిబల్ వాదనకు బలం చేకూరేలా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నిజంగానే బలహీనపడిందని పేర్కొన్నాడు.

చిదంబరం తాజాగా వ్యాఖ్యానిస్తూ.. ‘వరుసగా రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఓటమి తనకు బాధ కలిగిస్తోంది. సంస్థాగత ఉనికిని కాంగ్రెస్ కోల్పోయినట్లు కనిపిస్తోంది. నిజానికి బీహార్ లో ఆర్జేడీ-కాంగ్రెస్ గెలవాల్సింది. అక్కడ ఓటమికి ఎవరు కారణం.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్ లలో గెలిచి ఎక్కువ కాలమేమీ కావట్లేదన్న విషయాన్ని పార్టీ గుర్తించాలి’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎంఐఎం, సీపీఐ లాంటి పార్టీలు సంస్థాగతంగా బలంగా ఉంటే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని నిరూపించాయని చిదంబరం అన్నారు. . బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాని బలానికి మించి ఎక్కువ స్థానాల్లో పోటీచేసి ఓడిపోయిందని చిదంబరం అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని చిదంబరం అభిప్రాయపడ్డారు.