Begin typing your search above and press return to search.

పీఎం కేర్స్ ఫండ్ లెక్కలు ఎలా తెలుస్తాయి?

By:  Tupaki Desk   |   20 Aug 2020 5:28 PM GMT
పీఎం కేర్స్ ఫండ్ లెక్కలు ఎలా తెలుస్తాయి?
X
కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్ డౌన్ వల్ల వలస కూలీలు, నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరోనా విపత్తు నిధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్ర‌ధాన‌మంత్రి సిటిజ‌న్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమ‌ర్జెన్సీ సిచ్యువేష‌న్స్ (PM CARES)`పీఎం కేర్స్ ఫండ్` ను ఏర్పాటు చేశారు. కరోనా కట్టడి కోసం మానవతా దృక్ఫథంతో పీఎం కేర్ ఫండ్ కు ఎన్నారైలతోపాటు పలువురు వ్యాపార వేత్తలు, సెలబ్రిటీలు, సినీతారలు, క్రీడాకారులు, చాలామంది విరివిగా విరాళాలిచ్చారు. అయితే, పీఎం కేర్ నిధులను పీఎం కేర్ నిధుల లెక్కలు చెప్పాలని విపక్షాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్ర‌ధాని చైర్మ‌న్ గా మార్చి 28న ప్రారంభించిన ఈ పీఎం కేర్స్ ట్ర‌స్ట్ కు ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన నిధులు, వాటిని దేనికి ఖ‌ర్చు చేశారన్న దాన్ని వెబ్ సైట్ లో పెట్టేలా కేంద్రాన్ని ఆదేశించాల‌ని నాగ్ పూర్ లోని బాంబే హైకోర్టు బెంచ్ ఎదుట ఓ లాయర్ పిిటిషన్ దాఖలు చేశారు. పిటిష‌న‌ర్ వాద‌న‌తో ఏకీభ‌వించిన ధ‌ర్మాసనం రెండు వారాల్లోగా అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని కేంద్రాన్ని ఆదేశించింది. మరోవైపు, పీఎం కేర్ ఫండ్ నిధులను జాతీయ విపత్తు నిర్వహణ నిధి(ఎన్డీఆర్ఎఫ్)కు మళ్లించేలా ఆదేశించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

దీంతో, ఆ నిధులను స్క్కూటినీ చేయడానికి వీళ్లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఎం కేర్స్ ఫండ్ సేకరణపై చిదంబరం ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. పీఎంకేర్స్ ఫండ్ ఏర్పాటు చేసిన 5 రోజుల్లో రూ. 3076 కోట్ల విరాళం అందించిన దాతలెవరరో అని చిదంబరం అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ జాబితాలో చైనా కంపెనీలు కూడా ఉన్నాయా అంటూ చిదంబరం ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు అంతిమం అన్న చిదంబరం...కరోనా కట్టడి కోసం పీఎం కేర్ ఫండ్ నిధులు కేటాయించేందుకు ఉన్న విధివిధానాలు ఏమిటని ప్రశ్నించారు. పీఎం కేర్ ఫండ్ సమాచార హక్కు పరిధిలోనికి రాకపోతే దాని గురించిన కీలక సమాచారం ఎలా తెలుస్తుందని చిదంబరం ప్రశ్నించారు. పీఎం కేర్స్ ఫండ్ పారదర్శకత, వివరాలు, నిర్వహణ పద్దతి వంటి అంశాలు సుప్రీం కోర్టు దృష్టికి రాలేదని అన్నారు. పీఎం కేర్ ఫండ్ చట్టబద్ధతను గురించి మాత్రమే కోర్టు తీర్పునిచ్చిందని, ఫండ్ పై చర్చలు కొనసాగుతాయని చెప్పారు.