Begin typing your search above and press return to search.

కోళ్లు ఫ్రీ.. ఇలా అయితే క‌రోనాకూ భ‌య‌ప‌డ‌రా జ‌నాలు!

By:  Tupaki Desk   |   20 March 2020 2:30 AM GMT
కోళ్లు ఫ్రీ.. ఇలా అయితే క‌రోనాకూ భ‌య‌ప‌డ‌రా జ‌నాలు!
X
ఫ్రీ గా వ‌స్తే ఫినాయిల్ అయినా తాగేస్తార‌ని.. కొంద‌రు పీనాసుల గురించి జ‌నాలు చెబుతుంటారు. ఫ్రీగా వ‌చ్చింద‌ని ఫినాయిల్ తాగేయ‌డం అనేది జ‌నాల్లో బాగా వినిపించే సామెత‌. అనారోగ్యం పాల‌వుతామ‌నే భ‌యం ఉన్నా ఫ్రీగా వ‌స్తే జ‌నాలు తీసేసుకుంటార‌నే విష‌యం ఇప్పుడు మ‌రోసారి రుజువు అయ్యింది.

ఒక‌వైపు క‌రోనా భ‌యాల‌తో చికెన్ తిన‌డం బాగా త‌గ్గింది ప్ర‌జ‌లు. ఈ ప్ర‌భావం పౌల్ట్రీ ఇండ‌స్ట్రీపై గ‌ట్టిగా ప‌డింది. త‌మ ప‌రిస్థితి గురించి పౌల్ట్రీల య‌జ‌మానులు వాపోతూ ఉన్నారు. కోట్ల రూపాయ‌ల న‌ష్టాల‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. కిలో కోడి ఇర‌వై, ముప్పై రూపాయ‌ల‌కు కూడా ఇస్తూ కొంత‌మంది అయిన కాడికి సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. మ‌రి కొంద‌రు న‌ష్టాల భ‌యంతో కోళ్ల‌ను పిల్ల‌ల ద‌శ‌లోనే పూడ్చిపెడుతూ ఉన్నారు.

ఏతావాతా క‌రోనా భ‌యాల నేప‌థ్యంలో పౌల్ట్రీ ఇండ‌స్ట్రీ దారుణ‌మైన ఫ‌లితాల‌ను ఎదుర్కొంటూ ఉంది. ఈ ప‌రిస్థితి నుంచి ఎప్పుడు కోలుకునేద‌ని పౌల్ట్రీ య‌జామానులు గంద‌ర‌గోళంలో ప‌డ్డ‌ట్టుగా ఉన్నారు. ఇక మ‌రోవైపు చికెన్ వ‌ల్ల క‌రోనా రాదు అని వారు గ‌ట్టిగా ప్ర‌చారం చేస్తూ ఉన్నారు. ప్ర‌భుత్వాల ద్వారా కూడా ప్ర‌చారం చేయిస్తూ ఉన్నారు. కానీ జ‌నాలు న‌మ్ముతున్న‌ట్టుగా లేరు.

దీంతో చికెన్ సేల్స్ కోసం ధ‌ర‌లు త‌గ్గించేశారు. అయినా కొనుగోళ్లు త‌క్కువ‌గానే ఉన్నాయ‌ని ఆ వ్యాపారులు చెబుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కోళ్ల‌ను ఉచితంగా పంచాడు ఒక పౌల్ట్రీ య‌జ‌మాని. తెలంగాణ‌లోని మెద‌క్ జిల్లాలో వెల్దుర్తి ప్రాంతంలోని ఒక పౌల్ట్రీ య‌జ‌మాని ఉచితంగా కోళ్ల‌ను పంచి పెట్టాడు. 5,300 కోళ్ల‌ను ఉచితంగా పంచాడ‌ట ఆ వ్యాపారి. మామూలుగా అయితే జ‌నాలు కోళ్ల‌ను కొన‌డానికి ముందుకు రావ‌డం లేదు. నూటికి నాలుగు కేజీల కోడి ఇస్తామ‌న్నా కొన‌డం లేద‌ట‌. అదేమంటే క‌రోనా భ‌యం. అయితే ఈ ఉచిత కోళ్ల పంపిణీ మాత్రం విజ‌య‌వంతం అయ్యింద‌ట‌. ఒక్క కోడీ మిగ‌ల‌కుండా జ‌నాలు తీసుకెళ్లిపోయార‌ట‌. ఉచితంగా వ‌చ్చిన‌ప్పుడు మాత్రం క‌రోనా భ‌యం కూడా కోళ్ల‌ను తిన‌కుండా ఆపుతున్న‌ట్టుగా లేదు!