Begin typing your search above and press return to search.

ప్రైవేటు విందుకు అంత పెద్ద గుడిలో చికెన్ వండేశారు

By:  Tupaki Desk   |   8 April 2022 3:26 AM GMT
ప్రైవేటు విందుకు అంత పెద్ద గుడిలో చికెన్ వండేశారు
X
కనీస ఇంగితం కూడా లేకపోవటం అంటే ఇదేనేమో? ఈ తరహా దారుణాల్ని జీర్ణించుకోవటం కూడా కష్టమే అవుతుంది. ఒక ప్రముఖ దేవాలయంలో చోటు చేసుకున్న అపచారం గురించి విన్నంతనే.. ఇదెక్కడి పాపిష్ఠి ఆలోచన అనుకోకుండా ఉండలేం. ఏపీలోని గుంటూరు జిల్లా పెదకాకానిలో ఫేమస్ అయిన మల్లేశ్వరర్వామి దేవస్థానంలో చోటు చేసుకున్న ఉదంతం గురించి విన్నంతనే ఒళ్లు మండక మానదు. హిందువులతోపాటు అన్ని మతాల వారు వచ్చి.. భక్తిశ్రద్ధలతో పూజలు చేసే దేవాలయంలో దారుణానికి పాల్పడ్డారు.

ఏపీ అధికారపక్షం వైసీపీకి చెందిన ఒక మహిళా నేత భర్త చేసిన ఈ పాపిష్టి పని గురించి తెలిసిన భక్తులంతా మండిపడుతున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు వెళ్లే పెదకాకాని మల్లీశ్వరాలయంలోని భోజన క్యాంటీన్ కాంటాక్టును ఒక వ్యక్తి దక్కించుకున్నాడు.

బయట వ్యక్తులు చేసుకునే విందు కోసం చికెన్ ను తీసుకొచ్చి ఆలయంలో వండారు. ఆలయ ప్రాంగణంలో చికెన్ వాసన గుప్పుమనటంతో.. అనుమానం వచ్చిన భక్తులు ఆరా తీశారు.

భక్తుల ప్రశ్నకు స్పందించిన సదరు కాంట్రాక్టర్.. బయట వ్యక్తుల విందు కోసం ఆలయంలో చికెన్ వండించి పంపుతున్నట్లుగా పేర్కొన్నట్లు తెలిసిందే.

ఈ దారుణంలో అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీటీసీ భర్త ప్రమేయం ఉందని చెబుతున్నారు. పవిత్రమైన దేవాలయంలో కోడి మాంసాన్ని ఎలా వండుతారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంటే.. ఆలయ ఇన్ చార్జి ఈవో మాట్లాడుతూ.. చికెన్ వండలేదని.. బయట వండి క్యాంటీన్ కు తీసుకొచ్చారన్నారు. తమ వరకు ఈ విషయం వచ్చినంతనే కాంట్రాక్టర్ ను మందలించామని.. మరోసారి ఇలానే జరిగితే కాంట్రాక్టర్ లైసెన్సు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అయినా.. పవిత్రమైన దేవాలయానికి చికెన్ వండటం కాకున్నా.. తేవాలన్న ఆలోచన రావటం ఏమిటి? ఇలాంటి దారుణ తప్పులకు మందలించి వదిలేయటమా?