Begin typing your search above and press return to search.

ఐదు పైసలకే చికెన్ బిర్యానీ.. పోటెత్తిన జనం

By:  Tupaki Desk   |   6 Sept 2020 9:30 AM IST
ఐదు పైసలకే చికెన్ బిర్యానీ.. పోటెత్తిన జనం
X
అసలు ఐదు పైసలకు ఇప్పుడు ఏం వస్తుంది.. ఏమీ రాదు. పైగా ఐదు పైసల బిళ్ళల వినియోగం నిషేధించి ఏళ్ళవుతోంది. తమిళనాడు రాష్ట్రంలో ఓ హోటల్లో ఐదు పైసలకే చికెన్ బిర్యానీ విక్రయిస్తున్నట్లు ప్రకటన ఇవ్వడంతో జనం హోటల్ వద్దకు బారులు తీరారు. రామనాథపురం జిల్లాలో జిల్లా కేంద్రంతో పాటు పనైకులం, కీలక్కరై వంటి ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన బిర్యానీ సెంటర్లు ఉన్నాయి. చికెన్ బిర్యానీ కోసం జనం భారీగా వస్తుంటారు.

ఈ నేపథ్యంలో రామనాథపురం ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఓ బిర్యానీ హోటల్లో ఐదు పైసలకే చికెన్ బిర్యానీతో పాటు వంకాయ కుర్మా, పెరుగు పచ్చడి పెడుతున్నట్లు ప్రకటన ఇచ్చారు. ఇంకేముంది ఆ హోటల్ వద్దకు భోజన ప్రియులు క్యూ కట్టారు. చాలా మంది ఐదు పైసలు చెల్లించి చికెన్ బిర్యానీ లాగించారు. దీనిపై హోటల్ యజమాని ఫరత్ మాట్లాడుతూ కొత్తగా చికెన్ బిర్యానీ హోటల్ ప్రారంభించానని, హోటల్ గురించి అందరికీ ప్రచారం చేసేందుకు, ఇక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది.. అని చెప్పేందుకే ఐదు పైసలుకే బిర్యానీ అందించినట్లు చెప్పారు. పైగా కేవలం ఐదు పైసలు బిళ్ల తెచ్చిన వాళ్ళకే ఈ ఆఫర్ పెట్టమని చెప్పారు. పాత నాణేల గురించి ఇప్పటి వారికి అంతగా తెలియదని, వీటిపై అందరికీ అవగాహన కల్పించడం కూడా మరో ఉద్దేశమన్నారు. సుమారు 150 మంది ఐదు పైసల బిళ్ళలు చెల్లించి బిర్యానీ ఆరగించినట్లు హోటల్ యజమాని తెలిపాడు.