Begin typing your search above and press return to search.

ఛోటా రాజన్ ఎక్కడున్నా చంపేస్తా

By:  Tupaki Desk   |   27 Oct 2015 10:13 AM GMT
ఛోటా రాజన్ ఎక్కడున్నా చంపేస్తా
X
చీకటి సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఛోటా రాజన్ అరెస్టు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇండోనేసియా పోలీసులు ఆయన్ను పట్టుకున్నారని చెబుతున్నా.. వాళ్లకు సహాయం చేసింది మాత్రం రాజన్ శత్రువులేనట. వారి సహాయమే లేకుంటే రాజన్ ను వారు పట్టుకోలేకపోయేవారట. ఛోటా రాజన్ బద్ధశత్రువు, మరో మాఫియా నాయకుడు ఛోటా షకీల్ తానే రాజన్ ను పట్టించానని చెబుతున్నాడు.

ముంబయి కేంద్రంగా పనిచేసిన మాఫియా డాన్ దావూద్ వద్ద ఛోటా రాజన్ - ఛోటా షకీల్ లు ఇద్దరూ పనిచేసేవారు. అయితే... అనంతర కాలంలో ఎవరికి వారు సొంత సామ్రాజ్యాలు సృష్టించుకోవడంతో విభేదాలు పెరిగి ఒకరి వర్గాన్ని ఒకరు చంపుకోవడం ప్రారంభించారు. ఇలా ఛోటా రాజన్ - ఛోటా షకీల్ వర్గాల్లో ఎందరో తుపాకులకు బలైపోయారు. ఛోటా రాజన్ ను చంపడానికి షకీల్ ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నాడు. నిజానికి 15 ఏళ్ల క్రితం 2000 సంవత్సరం సెప్టెంబరులో ఛోటాషకీల్ గ్యాంగ్ దాడిలో రాజన్ ఆల్మోస్ట్ చావు అంచుల వరకు వెళ్లాడు. బ్యాంకాక్ లో ఆయన ఉన్న ఇంటిపైకి షకీల్ గ్యాంగ్ దాడి చేసి ఇష్టానుసారంగా కాల్పులు జరిపింది. రాజన్ ఒక గదిలో దూరి తలుపులు వేసుకుని ఉండిపోగా బయట నుంచి కాల్పులు జరిపారు. ఓ తూటా తలుపును చీల్చుకుని రాజన్ పొట్టలో దూరింది. ఇక ఆ గదిలో ఉంటే తనకు చావు తప్పదని గ్రహించిన రాజన్ మొదటి అంతస్తులో ఉన్న ఆ గది కిటికీ నుంచి కిందకు దూకేసి అక్కడున్న పూల మొక్కల చాటున దాక్కుని బతికి బయటపడ్డారు. అయితే, విజయ్ కదామ్ పేరుతో అప్పటికి చలామణీ అవుతున్న ఆయనను ఛోటా రాజన్ గా బ్యాంకాక్ పోలీసులు గుర్తించలేకపోయారు. ఆసుపత్రిలో చేర్చగా కోలుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఆ ఘటనలో సంతోష్ షెట్టి అనే రాజన్ ప్రధాన అనుచరుడు రాజన్ ను కాపాడినట్లు చెబుతారు.

ఆ తరువాత కూడా షకీల్ పలుమార్లు రాజన్ హత్యకు ప్రయత్నించాడు. తాజాగా ఆయన అరెస్టు అవడం వెనుకా తానే ఉన్నట్లు షకీల్ చెబుతున్నాడు. అయితే, రాజన్ అరెస్టు తమకు ఏమాత్రం సంతోషంగా లేదని చెబుతున్నారు. రాజన్ ఎక్కడెక్కడ దాక్కుంటున్నాడో తమకు ప్రతిదీ తెలుసని...వారం కిందట ఫిజీలో అతణ్ని వేసేయడానికి ట్రై చేసినా కుదరలేదని చెప్పాడు. అక్కడి నుంచి ఇండోనేసియాకు పారిపోతున్న విషయం తెలిసి.. అతడిని అరెస్టు చేయించానన్నాడు.

మరోవైపు దావూద్ ఇబ్రహీం కూడా రాజన్ అరెస్టును జీర్ణించుకోలేకపోతోంది. తమ శత్రుత్వం ఇక్కడితో ముగిసిపోయేది కాదని మాఫియా నాయకులు అంటున్నారు. ఎలాగైనా అతడిని చంపాలనుకుంటున్నామని... ఇండోనేసియా నుంచి ఇండియాకు పంపించినా తాము వెంటాడుతామని చెబుతున్నాడు. భారత ప్రభుత్వం ఇన్నాళ్లు రాజన్‌ ను పెంచి పోషించిందని... తమమీదకు ఉసిగొల్పారని షకీల్ మండిపడ్డాడు. అసలు భారతదేశంలో అతడి మీద విచారణ జరిగి, శిక్ష పడుతుందన్న నమ్మకం తమకు లేదంటున్నాడు.