Begin typing your search above and press return to search.

కొత్త రచ్చ: సహజీవనం చేసి అత్యాచార కేసులు పెడతారా?

By:  Tupaki Desk   |   12 Dec 2020 10:19 AM IST
కొత్త రచ్చ: సహజీవనం చేసి అత్యాచార కేసులు పెడతారా?
X
మహిళలకు రక్షణగా వారికి ఎదురయ్యే సమస్యల్ని తీర్చే పదవిలో ఉండి.. అందుకు భిన్నంగా చత్తీస్ గఢ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఇష్టంగా సహజీవనం చేసి.. ఆ తర్వాత కొందరు మహిళలు అత్యాచార కేసులు పెడుతున్నారన్న ఆమె వ్యాఖ్యలు సంచలనంగా.. వివాదాస్పదంగా మారాయి. కొందరు మహిళలు పెడుతున్న కేసులపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడ హాట్ టాపిక్ గా మారాయి.

పెళ్లైన వ్యక్తి ఎవరైనా ప్రేమ పేరుతో తమను వలలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. వారు చెప్పేవి అబద్ధాలుగా అమ్మాయిలు పసిగట్టాలన్నారు. అలాంటి వారు తమకు ఏ విధంగా సాయం చేయరన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అలాంటి వారిపై ముందే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసులు పెట్టాలన్నారు. అందుకు భిన్నంగా వారితో ఇష్టంగా కొంతకాలం సహజీవనం చేసి.. ఆ తర్వాత వచ్చి అత్యాచార కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు.

అలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని.. వాటి వల్ల ఎలాంటి మంచి జరగదన్న కిరణ్మయి అమ్మాయిల్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ముందు మీ సంబంధాలు.. పరిస్థితుల్ని సరి చూసుకోండి. మహిళగా నేను మిమ్మలందరిని కోరుతున్నా. ఒకవేళ మీరు అలాంటి సంబంధాల్లోకి అడుగు పెడితే.. ఫలితం ఎప్పుడూ చెడుగానే ఉంటుంది’’ అనిఆమె పేర్కొన్నారు. అన్ని ఉదంతాలు ఆమె చెప్పినట్లు ఉండవని.. తరచూ మహిళలు మోసానికి గురవుతుంటారని.. కానీ.. అలాంటి వ్యాఖ్యలు తగదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

మరోవైపు అమ్మాయిలు చదువు పూర్తి కాక ముందే పెళ్లి మీద దృష్టి పెట్టొద్దని పేర్కొన్నారు. ఈ మధ్యన తానుకొత్త ట్రెండ్ ను చూస్తున్నానని.. 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకొని.. ఓ బిడ్డను ఎత్తుకొని తమ దగ్గరకు వస్తున్నారంటూ కాస్తంత ఘాటుగా వ్యాఖ్యానించారు. ముందు అమ్మాయిలు తమ చదువును పూర్తి చేసి. ఏదైనా బాధ్యత కలిగి ఉంటే.. అలాంటి వారిని పెళ్లి చేసుకునే వారు బాధ్యతగా ఉంటారన్నారు.

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటంతో.. ఈ వ్యాఖ్యలపై స్పందించాలని రాష్ట్ర సీఎం భూపేశ్ బాఘెల్ ను కోరగా.. ఆయన నో చెప్పారు. కిరణ్మయి చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించనని.. రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న ఆమె ఏదైనా చెప్పారంటే.. తన అనుభవాల నుంచి కానీ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే చెబుతారంటూ ఆచితూచి అన్నట్లుగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.