Begin typing your search above and press return to search.

అమర జవాను మురళీకృష్ణ పార్థివ దేహానికి సీపీ నివాళి

By:  Tupaki Desk   |   6 April 2021 9:18 AM IST
అమర జవాను మురళీకృష్ణ పార్థివ దేహానికి సీపీ నివాళి
X
ఛత్తీస్ గఢ్ బీజాపూర్లో జరిగిన నక్సల్స్ దాడులు దేశవ్యాప్తంగా అందరినీ కన్నీరుపెట్టిస్తున్నాయి. ఈ దుర్ఘటనలో 22మంది జవాన్లు అమరులయ్యారు. ఈ దాడుల్లో విజయనగరం జిల్లాకు చెందిన జగదీశ్, గుంటూరు జిల్లాకు చెందిన శాఖమూరి మురళీకృష్ణలు వీరమరణం పొందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరమరణం పొందిన జవాన్ల భౌతిక దేహాలను స్వస్థలాలకు చేర్చుతున్నారు.

ఛత్తీస్ గఢ్ నక్సల్ దాడిలో అమరుడైన వీర జవాన్ శాఖమూరి మురళీకృష్ణ పార్థివ దేహం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఆయన మృతదేహానికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ నివాళులు అర్పించారు. అమర జవాన్లకు తెలంగాణ పోలీసు శాఖ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నామని అన్నారు. అమరులను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని సూచించారు. మురళీకృష్ణ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మురళీకృష్ణ పార్థివ దేహాన్ని ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి తరలిస్తున్నారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనంలో చేరవేస్తున్నారు. బుధవారం ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమర జవానుకు అంతిమ వీడ్కోలు కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు, స్థానికులు హాజరయ్యే అవకాశం ఉంది.

మావోయిస్టులు పక్కా పథకంతోనే ఈ దాడులకు పాల్పడ్డారని సీఆర్పీఎఫ్ అధికారులు అంటున్నారు. కూంబింగ్ ఆపరేషన్ గురించి ముందుగానే తెలుసుకొనే మెషీన్ గన్స్, అండర్ బ్యారెల్ గ్రనేడ్, దేశీ రాకెట్లతో దాడులకు పాల్పడ్డారని చెబుతున్నారు. కోబ్రా యూనిట్, డీఆర్జీ, ఎస్టీఎఫ్ డిపార్ట్మెంట్లకు చెందిన 400 మంది భద్రతా సిబ్బంది జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ కు వెళ్లారని చెప్పారు. అమరులైన జవాన్ల నుంచి ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బూట్లు వంటివి స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. ఇకపోతే మావోలు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. జమ్మూకశ్మీర్ కు చెందిన రాకేశ్వర్ అనే జవాను ఇంకా నక్సల్స్ చెరలోనే ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.