Begin typing your search above and press return to search.

150 కి.మీ. నడిచి..మరికొద్దిసేపట్లో ఇంటికి చేరుతుందనగా మృతి!

By:  Tupaki Desk   |   21 April 2020 7:36 PM IST
150 కి.మీ. నడిచి..మరికొద్దిసేపట్లో ఇంటికి చేరుతుందనగా మృతి!
X
కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వందల కిలోమీటర్లు కాలినడక కొనసాగిస్తున్నారు. కాగా , తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు కాలినడకన తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన 12 ఏళ్ల బాలిక.. 3 రోజుల పాటు దాదాపు 150 కిలోమీటర్లు నడిచి చివరికి ప్రాణాలు కోల్పోయింది.

మరి కొన్ని గంటల్లో సొంత గ్రామానికి చేరాల్సిన ఆ బాలిక కానరాని లోకాలకు వెళ్లిపోయింది. అప్పటికే 150 కిలోమీటర్లు నడిచిన ఆమె, తన గ్రామానికి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దీని పై పూర్తి వివరాలు చూస్తే ..జమ్లో మడ్కమ్ అనే 12ఏళ్ల బాలిక తన కుటుంబాన్ని పోషించేందుకు తెలంగాణలోని ఓ గ్రామంలో కూలీపనులు చేస్తుండేది. అయితే మళ్లీ లాక్ డౌన్ పొడిగిస్తారేమో అన్న ఆందోళనతో ఏప్రిల్-15న జమ్లో...తనతోటి పనిచేసే 11మంది తో కలిసి తన స్వస్థలమైన చత్తీస్ ఘడ్ లోని బీజాపుర్ జిల్లాకి చేరుకునేందుకు కాలినడక ప్రారంభించింది.

అయితే శనివారం మధ్యాహ్నాం ఇంటికి ఇంకో 14కిలోమీటర్లు దూరంలో ఉండగా,జమ్లోకి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. కొద్దిసేపటికే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఆ అమ్మాయికి కరోనా నిర్దారణ పరీక్షలు చేసిన బీజాపూర్‌ కు చెందిన వైద్యులు కరోనా నెగటివ్ అని తేల్చారు. ఆమె పోషకాహార లోపం, డీహైడ్రేషన్ కారణంగా మృతి చెందిందని వైద్యులు తేల్చారు. కాగా, ఛత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వం బాలిక కుటుంబానికి రూ.లక్ష పరిహారం ప్రకటించింది.