Begin typing your search above and press return to search.

సీఎంకి చెర్నకోలతో దెబ్బలు :అయినా కొట్టినోళ్లకు నమస్కారం పెట్టిన ముఖ్యమంత్రి

By:  Tupaki Desk   |   15 Nov 2020 4:40 PM IST
సీఎంకి చెర్నకోలతో దెబ్బలు :అయినా కొట్టినోళ్లకు నమస్కారం  పెట్టిన ముఖ్యమంత్రి
X
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చెర్నకోలతో దెబ్బలు కొట్టడం అంటే మామూలు విషయమా.. ఒకవేళ ముఖ్యమంత్రి ని దెబ్బలు కొడితే.. ఏమీ అనకుండా నమస్కరించి తిరిగి వెళతారా ..అలా ఎన్నటికీ జరగదు కదా..కానీ ఛత్తీస్‌గఢ్ లో జరిగింది. తనను ఓ వ్యక్తి ఆరు సార్లు చెర్నకోలతో కొట్టగా ఆ బాధ భరిస్తూనే అతడికి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేలా నమస్కరించి వెళ్లారు. అదేంటి. సీఎంని కొట్టడం ఏంటి.. ఆయన ఏమీ అనకుండా తిరిగి వెళ్ళి పోవడం ఏంటి.. అనుకోకండి.. ఆ రాష్ట్రంలో దీపావళి సందర్భంగా జరిగే ఓ కార్యక్రమంలో ఇది ఆనవాయితీ.

దీపావళి వేడుకల్లో భాగంగా సీఎం భూపేష్ బఘేల్ దుర్గ్ జిల్లాలోని జాంజ్‌గిరీ గ్రామానికి వెళ్లారు. అక్కడి స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం చర్నకోలతో దెబ్బలు తిన్నారు. బీరేంద్ర ఠాకూర్ అనే వ్యక్తి చెర్నకోలతో ఆరు సార్లు సీఎంని కొట్టాడు. ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా జరిగే గోవర్ధన్ పూజకు ముందు సీఎం ఇలా చర్నకోలతో కొట్టించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా ఆయన ఈ సాంప్రదాయాన్ని పాటించారు.

ప్రతి సంవత్సరం ఆయనను భరోసా ఠాకూర్ అనే వృద్ధుడు చర్నకోలతో కొట్టేవారు. కిందట ఆయన మరణించడంతో, ఆయన కుమారుడు బీరేంద్ర ఠాకూర్ ముఖ్యమంత్రిని చర్నాకోలతో కొట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు చెప్పారు. సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని ఆయన వెల్లడించారు. ప్రజల సంక్షేమానికి అవసరమైన కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు.