Begin typing your search above and press return to search.

చెవిరెడ్డి, రోజా.. మరో ఇద్దరుంటే

By:  Tupaki Desk   |   8 Sep 2015 5:34 PM GMT
చెవిరెడ్డి, రోజా.. మరో ఇద్దరుంటే
X
చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రోజా వంటి వాళ్లు వైసీపీలో మరో ఇద్దరుంటే చాలని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. అలాంటి వాళ్లను వెతికి మరీ వైసీపీలోకి పంపించాలని కూడా ఆలోచిస్తున్నారు. చెవిరెడ్ది, రోజా వంటి వాళ్లు మరో ఇద్దరుంటే వచ్చే ఎన్నికల్లోనే కాదు.. ఆ తర్వాత కూడా తాము పెద్దగా కష్టపడాల్సిన పని లేదని, తమ గెలుపును కూడా వాళ్లే సులభతరం చేస్తారని, తమ గెలుపు నల్లేరు మీద బండి నడకేనని వ్యాఖ్యానిస్తున్నారు.

చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఎమ్మెల్యే అయిన తొలి రోజుల నుంచీ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులపైనే గురి పెట్టారు. మరీ ముఖ్యంగా పోలీసులతో ఆయన తగాదా పడుతున్నారు. గతంలో చంద్రగిరిలోనూ ఇదే విధంగా ఆయన గొడవ పడ్డాడు. తాజాగా, రాజమండ్రిలో పోలీసులు, అధికారులపై విరుచుకుపడ్డాడు. గతంలో నగరిలో రోజా కూడా ఇదే తరహాలో అధికారులపై విరుచుకుపడ్డారు. అధికారుల అంతు చూస్తామనే తరహాలో వ్యాఖ్యానించారు.

వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీ అక్రమ కేసులు పెట్టడం తెలుగు రాష్ట్రాల్లో సర్వ సాధారణంగా మారింది. గతంలో కాంగ్రెస్ హయాంలో ఇదే జరిగింది. ఇప్పుడు టీడీపీ పాలనలో కూడా అదే జరుగుతోంది. భవిష్యత్తులో మరో పార్టీ వచ్చినా ఇదే జరుగుతుంది. ఇందులో ఆశ్చర్యం లేదు. అయితే, అక్రమ కేసులు అయినా మరొక దాని గురించి అయినా తమ ప్రత్యర్థి ప్రభుత్వం, అధికార పార్టీ అనే స్పృహ ప్రతిపక్షాలకు ఉండాలి. తప్పితే, అధికారులను నిందించడం వలన ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అధికారులు నిబంధనల ప్రకారం వెళ్లిపోతారు. కాస్త అధికార పార్టీకి మొగ్గు చూపుతారు. అంతే తప్పితే, మొత్తం నిర్ణయాలను వాళ్లు తీసుకోరు. ప్రతిపక్ష ఎమ్మెల్యేను వేధించాలనే ఆలోచన ఒక అధికారి చేస్తే ఆ తర్వాత అతని ఉద్యోగానికే భద్రత ఉండదు. కానీ, అధికార పార్టీనో ప్రభుత్వమో ఆదేశిస్తే తనకు వాళ్ల అండ ఉంటుందిలే అని చేస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా లక్ష్యంగా చేసుకోవాల్సింది అధికార పార్టీని, ప్రభుత్వాన్ని తప్పితే అధికారులను కాదు. కానీ, వైసీపీ నాయకులు ఇందుకు పూర్తి భిన్నం కదా. అధికారులను బెదిరిస్తే వాళ్లు తమపై కేసులు పెట్టరని భావిస్తున్నారు. కానీ, ఇప్పుడు కేసులు పెట్టడమే కాదు.. ఎన్నికల సమయంలో వ్యతిరేకంగానూ పని చేస్తారు. అంత శక్తిమంతులు అధికారులు. ఈ విషయం చంద్రబాబుకు పదేళ్ల కిందట చాలా బాగా అర్థమైంది. వైసీపీకి అర్థం కావడానికి ఇంకా ఎంత కాలం పడుతుందో?