Begin typing your search above and press return to search.

చెవిరెడ్డి.. బొండాల రచ్చేంది..?

By:  Tupaki Desk   |   27 Sep 2015 9:53 AM GMT
చెవిరెడ్డి.. బొండాల రచ్చేంది..?
X
అధినేతలకు కొమ్ము కాయటం నేతలకు మామూలే. కాకుంటే.. కొందరు నేతలు తమ అధినేత పట్ల అంతులేని అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. తమకు తప్ప వేరెవరికి అంత విధేయత లేదన్నట్లుగా వ్యవహరించటం వారికి మాత్రమే చెల్లుతుంది. ఇలాంటి వైఖరి ప్రతి పార్టీలో ఉండేదే అయినా.. ఏపీ అధికార.. విపక్షాలకు సంబంధించి ఇద్దరి నేతల తీరు ఒకేలా ఉండటం కాస్తంత విశేషంగా చెప్పాలి.

మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యే బొండా ఉమకు తెలుగుదేశం పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే అంతులేని అభిమానం. ఆయన కోసం ఎంతదూరమైనా వెళ్లటానికి సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. 2014 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ స్థానం నుంచి ఎన్నికైన ఆయన ఏపీ అసెంబ్లీలో చురుగ్గా వ్యవహరిస్తుంటారు.

సరిగ్గా ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ నుంచి వ్యక్తి ఏపీ విపక్షానికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే పడి చచ్చే ఆయన.. వైఎస్ ను ఎలా అభిమానిస్తారో.. అంతగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను ఆరాధిస్తారు. జగన్ కనుసైగ లేకుండానే ఆయన మనసులో ఏముందో తెలుసుకొని అసెంబ్లీలో వ్యవహరించే ఆయనకు దూకుడు ఎక్కువ. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన చెవిరెడ్డి.. ఎలాంటి జంకూ బొంకూ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ.. సీనియర్ నేతల పైనా శివాలెత్తుతూ అధికారపార్టీ నేతలకు సుపరిచితులుగా మారిన పరిస్థితి.

మరి.. ఇలాంటి ఇద్దరు విపరీతాభిమానుల మధ్య రాజకీయ వైరుధ్యం అంటే మామూలు విషయం కాదుగా. అందుకే.. ప్రతి విషయంలోనూ వీరిద్దరూ తెగ విరుచుకుపడుతుంటారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ తమ కుటుంబ ఆస్తులు ప్రకటించిన అంశంపై చెవిరెడ్డి విమర్శలు చేయటంతో తాజా రచ్చ మొదలైంది. లోకేశ్ ప్రకటించిన ఆస్తులపై విమర్శలు చేసిన చెవిరెడ్డిపై విరుచుకుపడిన బొండా ఉమ.. ఆయనకు ఎర్రచందనం అక్రమ రవాణాతో సంబంధం ఉందని.. అలాంటి వ్యక్తి తమ అధినేత కుమారుడిపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు.

చిన్న విషయాలకే చెలరేగిపోయే చెవిరెడ్డి.. బొండా ఉమ విమర్శలకు మామూలుగా ఉంటారా? అందుకే ఆయన తన నోటికి పని చెప్పారు. తిరుపతిలో ఉన్న సమయంలో ఉమ పాత ఇనుము వ్యాపారం చేశారని.. అప్పట్లో ఆయనపై ఇనుము దొంగతనం కేసు ఉందని ఆరోపించారు. తనపై ఎర్రచందనం అక్రమ వ్యాపారం చేస్తున్నారన్న ముద్ర వేసిన బొండా ఉమపై చెలరేగిపోవటమే కాదు.. ఆయనపై ఆరోపణ చేసిన నేపథ్యంలో ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయ రచ్చ మరింత ముదరటం ఖాయమని చెబుతున్నారు.