Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రు రాజుల మ‌ధ్య‌న ముదిరిన వివాదం!

By:  Tupaki Desk   |   4 Feb 2020 11:30 PM GMT
ఆ ఇద్ద‌రు రాజుల మ‌ధ్య‌న ముదిరిన వివాదం!
X
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇద్ద‌రు రాజుల మ‌ధ్య‌న విబేధాలు ముదిరాయ‌ని స‌మాచారం. ఆ ఇద్ద‌రు నేత‌లూ ఒక జిల్లాకు చెందిన వారే. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఒక‌రు ఎంపీగా ఉంటే, మరొక‌రు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. వీరిద్ద‌రూ తీవ్ర విబేధాల‌తో ఉన్నార‌ని స‌మాచారం. రాజ‌కీయ కార‌ణాల‌తోనే వీరిద్ద‌రిలో ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌టం లేద‌ని తెలుస్తోంది.

ఆచంట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గిన చెరుకువాడ శ్రీరంగ‌నాథ రాజు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేబినెట్లో స్థానం పొందిన సంగ‌తి తెలిసిందే. మినిస్ట‌ర్ ఆఫ్ హౌసింగ్ బాధ్య‌త‌ల్లో ఆయ‌న ఉన్నారు. ఈ మంత్రితో తీవ్రంగా విబేధిస్తున్న‌ది ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణం రాజు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వీరిద్ద‌రూ క‌లిసి ప్ర‌చారం చేసుకున్నారు. ర‌ఘురామ‌కృష్ణం రాజు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌ర‌సాపురం ఎంపీ సీటు ప‌రిధిలోకే ఆచంట నియోజ‌క‌వ‌ర్గం కూడా వ‌స్తుంది. ఇలా వీరిద్ద‌రూ ఒక‌రి కోసం ఒక‌రు ఉండాల్సిన నేత‌లు.

అయితే ఈ ఇద్ద‌రి మ‌ధ్య‌న విబేధాలు మాత్రం ముదిరాయ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే రఘురామ‌కృష్ణం రాజు వైసీపీలో ర‌క‌ర‌కాల ప్ర‌క‌ట‌న‌ల‌తో ర‌చ్చ రేపుతున్నారు.ఆయ‌న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా అనేది కూడా అనుమానాస్ప‌దంగానే ఉంది. ఈ నేప‌థ్యంలో మంత్రితో విబేధాల విష‌యంలో కూడా ర‌ఘురామ‌కృష్ణం రాజు అస్స‌లు వెన‌క్కు త‌గ్గ‌డం లేద‌ని తెలుస్తోంది.