Begin typing your search above and press return to search.

చెత్తలోనూ ‘లక్ష’ మార్క్ తప్పలేదు

By:  Tupaki Desk   |   9 Dec 2015 4:05 AM GMT
చెత్తలోనూ ‘లక్ష’ మార్క్ తప్పలేదు
X
చెన్నైని అతలాకుతలం చేసిన భారీ వర్షాలు.. వరదల కారణంగా దాదాపు లక్ష కోట్ల రూపాయిలకు పైనే ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా అంచనాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇంత భారీ మొత్తం ఒక ప్రకృతి వైపరీత్యం కారణంగా నష్టపోవటం ఈ మధ్య కాలంలోచోటు చేసుకోలేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మరో లక్ష మార్క్ ను చెన్నై టచ్ చేసినట్లు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాలు ఆరేడు అడుగుల వరద నీటిలో మునగటం తెలిసిందే.

లక్షలాది మంది ప్రజలు మొదటి అంతస్తు మీదకు వెళ్లటం.. కొన్ని ప్రాంతాల్లో రెండో అంతస్తుల్లో ఉండటం.. టెర్రస్ మీద రోజుల తరబడి ఉండటం లాంటివి తెలిసిందే. భారీ ఎత్తున చెన్నైని ముంచెత్తిన వరద నీరు కారణంగా.. లక్షలాది ఇళ్లల్లోని సామాను భారీగా నష్టపోయారు. ఇక..వరద నీటి కారణంగా భారీ ఎత్తున బురద ఇళ్లల్లోకి చేరిపోవటంతో.. పెద్ద ఎత్తున వస్తువులు నష్టపోయారు.

వీటిని శుభ్రం చేసుకునే క్రమంలో పెద్ద ఎత్తున చెత్త వీధుల్లో పేరుకుపోతుంది. తాజా అంచనాల ప్రకారం దాదాపు లక్ష టన్నులకు పైగా చెత్త వచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు. పారిశుద్ధ్యంతో పాటు.. అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న ఈ చెత్తపై దృష్టి పెట్టిన జయ సర్కారు.. భారీ ఎత్తున పారిశుద్ధ్య కార్మికుల్ని రంగంలోకి దింపారు. 10వేల మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు రాత్రిపగలు అన్న తేడా లేకుండా చెత్తను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ.. చెత్త తొలగని పరిస్థితి నెలకొంది.

చెన్నై నగరంలో పేరుకుపోయిన చెత్తను తొలగించటానికి మరో నాలుగైదు రోజులు పట్టినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. విపరీతంగా శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఒక్కొక్కరికి రూ.2వేల నజరానాను సీఎం జయలలిత ప్రకటించారు. నిజానికి వారు పడుతున్న కష్టానికి ఈ మొత్తం ఒక మూలకు సరిపోదని చెప్పక తప్పదు. భారీ వరదలతో నిన్నటి వరకూ తన్ని పురిగా ఉన్న చెన్నపురి.. ఇప్పుడు చెత్తపురిగా దర్శనమిస్తోంది.