Begin typing your search above and press return to search.

మిర్చి బజ్జీ మాటల్ని విందామా? పెరుగన్నం మాటలకు ఫిక్స్ అవుదామా?

By:  Tupaki Desk   |   13 Jun 2021 12:30 AM GMT
మిర్చి బజ్జీ మాటల్ని విందామా? పెరుగన్నం మాటలకు ఫిక్స్ అవుదామా?
X
చూస్తుండగానే ఫస్ట్ వేవ్ వెళ్లిపోయి.. సెకండ్ వేవ్ వచ్చి.. దారుణంగా దెబ్బ తీసి తన దారిన తాను పోతున్న పరిస్థితి. మరికొద్ది రోజుల్లో మొదటి వేవ్ ముగిసిన తర్వాతి పరిస్థితులు చోటు చేసుకోనున్నట్లుగా చెప్పాలి. మరో మూడు నెలల వ్యవధిలో మూడో వేవ్ వస్తుందన్న అంచనా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సెకండ్ వేవ్ ఇచ్చిన షాక్ నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే తగిన చర్యలు చేపట్టటంతో పాటు.. థర్డ్ వేవ్ వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న వ్యూహాల్ని సిద్ధం చేస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. రెండో వేవ్ వేళ.. ‘‘విపరీతమైన ఫస్ట్రేషన్ తో ఉన్నాను.. ఈ రోజు గట్టిగానే బరస్ట్ అవ్వాలనుకుంటున్నా’’ అంటూ విశాఖకు చెందిన డాక్టర్ మల్లిక్ చేసిన వీడియో వాట్సాప్ లో విపరీతంగా వైరల్ అయ్యింది. ఒక్కసారిగా తెలుగు ప్రజలకు.. కరోనావైరస్ ను వారికి అర్థమయ్యే భాషలో చెప్పేవాడు దొరకటమే కాదు.. చదువుకున్న వారే కాదు చదువు లేని వారికి సైతం ఇట్టే అర్థమై.. మహమ్మారితో ఎంత జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని అర్థమయ్యేలా చేశారు. ఇతడి మాటల్ని కొందరు తిట్టిపోస్తే.. మరికొందరు మంచి పని చేశారంటూ అభినందిస్తున్నారు. మొత్తంగా తెలుగు ప్రజల్లో హాట్ టాపిక్ గా మారారు డాక్టర్ మల్లిక్.

ఇదిలా ఉంటే.. థర్డ్ వేవ్ పైన తాజాగా ఆయన చేస్తున్న విశ్లేషణలు.. చెబుతున్న అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆయన చెబుతున్న విషయాల్ని టీవీ చానళ్లు సైతం చూపించటం షురూ చేశాయి. థర్డ్ వేవ్ మరింత ప్రమాదకరంగా ఉంటుందంటూ ఆయన చెబుతున్న మాటలపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల్ని ఇంతలా భయపెట్టి సాధించేదేమిటి? అంటూ తీవ్రంగా తప్పు పడుతున్నారు.

నిజాలు చెబితే భయపెట్టటం ఏమిటి? నన్ను కూడా నిజాలు చెప్పకుండా విషయాల్ని దాచేయమంటారా? అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. థర్డ్ వేవ్ తీవ్రతను కొట్టి పారేయటం లేదు కానీ.. మరీ ఇంత బీభత్సంగా విప్పి చెప్పి.. భయాందోళనలకు గురి చేయాల్సిన అవసరం లేదని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మల్లిక్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. కౌంటర్ ఇవ్వటం షురూ చేశారు. అలాంటి కౌంటర్లలో చెప్పుకోదగిన వీడియోగా డాక్టర్ వేణుగోపాల్ రెడ్డిది చెప్పాలి. థర్డ్ వేవ్ తీవ్రతపై మల్లిక్ చేస్తున్న వ్యాఖ్యల్ని తప్పు పడుతూనే.. తనదైన శైలిలో ఆయన వైరస్ తీవ్రతను వెల్లడిస్తున్నారు.

మల్లిక్ మాటల్ని మిర్చి బజ్జీలుగా కొందరు అభివర్ణిస్తూ.. వేణుగోపాల్ మాటల్ని పెరుగన్నంతో పోలుస్తున్నారు. థర్డ్ వేవ్ కు సంబంధించి ఈ ఇద్దరి మాటల్ని వినాల్సిన అవసరం ఉందంటున్నారు. ఏమైనా సెకండ్ వేవ్ షాకింగ్ అనుభవం నేపథ్యంలో థర్డ్ వేవ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. మరి.. మీకు మిర్చి బజ్జీ నచ్చుతుందా? పెరుగన్నాన్ని ఇష్టపడతారా? చూడండి.