Begin typing your search above and press return to search.

రెమ్ డెసివిర్ అక్రమ దందాకు చెక్.. సూత్రధారులను అరెస్ట్ చేసిన పోలీసులు..!

By:  Tupaki Desk   |   11 May 2021 4:24 AM GMT
రెమ్ డెసివిర్ అక్రమ దందాకు చెక్..  సూత్రధారులను అరెస్ట్ చేసిన పోలీసులు..!
X
కరోనా బాధితులను కాపాడటానికి మందులు లేవు. ఒక్క రెమ్ డెసివిర్ మందు మాత్రమే బాధితులను ప్రాణాపాయం నుంచి బయట పడేస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా రెమ్ డెసివిర్ మందుకు ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. ఒక్కో ఇంజక్షన్ ను రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకూ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. రోగుల అత్యవసర అవసరాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు నకిలీ రెమ్ డెసివిర్ మందు తయారు చేసి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నకిలీ రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు చెందిన ముఠాను, తెలంగాణలోని మిర్యాలగూడలో బ్లాక్ లో రెమ్ డెసివిర్ మందులను విక్రయిస్తున్న సూత్రధారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

వీహెచ్ పీ జబల్ పూర్ చీఫ్ సరబ్ జీత్ కు నగరంలో ఓ ఆసుపత్రి ఉంది. ఆ ఆస్పత్రిలోనే దేవేంద్ర చౌరాసియా మేనేజర్ గా పని చేస్తున్నారు. స్వపన్ జైన్ ఫార్మా కంపెనీల డీలర్షిప్ వ్యవహారాలు చూస్తున్నాడు. సరబ్ జీత్ ఇండోర్ నుంచి 500 నకిలీ రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు తెప్పించి ఒక్కో దాన్ని రూ.35 వేల నుంచి రూ.40 వరకూ విక్రయించారు. నకిలీ ఇంజెక్షన్స్ తయారు చేసే ముఠా లక్ష దాకా నకిలీ రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను ఉప్పు, గ్లూకోజ్ తో తయారు చేసి దేశవ్యాప్తంగా ఈ ముఠా విక్రయించింది.

నకిలీ ఇంజక్షన్ల లో 3,000 ఇండోర్కు 3500 జభల్ పూర్ కు చేరుకున్నాయని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వివేక్ టంకా ఆరోపించారు. ఈ అక్రమ దందా పై సీబీఐ విచారణకు ఆదేశించాలని లేకపోతే కోర్టుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు.ఈ అక్రమ దందా కు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో వీహెచ్ పీ నేత ఆస్పత్రికి చెందిన స్వపన్ జైన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సరబ్ జిత్, చౌరసియా పరారీలో ఉన్నారు.

అలాగే నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో శ్రీ సూర్య ఆసుపత్రి లో కూడా పోలీసులు దాడులు నిర్వహించి బ్లాక్ లో తెచ్చి విక్రయిస్తున్న రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను సీజ్ చేశారు. మిర్యాలగూడ కు చెందిన బాలకృష్ణ హైదరాబాద్ లో ఇంజక్షన్లు తయారు చేసే హెటిరో కంపెనీ లో మేనేజర్ గా పని చేస్తున్నాడు. అతడు ఉప్పల్ లోని శ్రీ లక్ష్మి ఏజెన్సీస్ కు రూ. 3 వేలకు ఒక ఇంజక్షన్ చొప్పున విక్రయిస్తున్నాడు. బాలకృష్ణ తన స్నేహితుడు అయిన గణపతి రెడ్డి ద్వారా శ్రీ లక్ష్మి ఏజెన్సీస్ లో ఒక్కో ఇంజక్షన్ ను రూ. 8 వేలకు కొనుక్కొని మిర్యాలగూడ లోని శ్రీ సూర్య ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఆ ఆస్పత్రికి వీరు ఒక ఇంజెక్షన్ ను రూ. 23 వేలకు విక్రయిస్తున్నారు.

ఆస్పత్రి యాజమాన్యం కరోనా రోగుల వద్ద నుంచి ఒక్కో ఇంజక్షన్ కు రూ. 35 వేల నుంచి రూ. 50 వేల వరకూ వసూలు చేస్తున్నారు. రెండు రోజుల కిందట పోలీసులు శ్రీ సూర్య ఆసుపత్రిపై దాడి చేసి ఆస్పత్రి డాక్టర్ అశోక్ కుమార్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీఐజీ రంగనాథ్ తెలిపారు. అలాగే హెటిరో మేనేజర్ బాలకృష్ణ, అతని స్నేహితుడు గణపతి రెడ్డి లను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.