Begin typing your search above and press return to search.

అమ్మ మాట వినకుంటే ఇలానే ఉంటది మరి

By:  Tupaki Desk   |   6 Aug 2016 4:50 AM GMT
అమ్మ మాట వినకుంటే ఇలానే ఉంటది మరి
X
తమిళనాడు ముఖ్యమంత్రి కమ్ అమ్మగా సుపరిచితురాలైన జయలలిత వైఖరి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు నచ్చిన వారి పొడను కూడా కిలోమీటర్ దూరాన ఉండే అమ్మకు.. తాను పెంచి పెద్ద చేసిన ఒక నేత తిరుగుబాటు స్వరం వినిపించటం.. తాను ఆదేశించిన తర్వాత కూడా ‘నో’ అనేయటం ఆమె అహాన్ని ఎంతగా డ్యామేజ్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాలసిన అవసరం లేదు. అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యురాలు శశికళా పుష్ప ఎపిసోడ్ అమ్మకే షాకివ్వటం తెలిసిందే.

డీఎంకేకు చెందిన రాజ్యసభ సభ్యుడిని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో చెంపదెబ్బ కొట్టటం.. వారిద్దరి ఇష్యూపై జయలలిత సీరియస్ గా ఉండటం..ఆమెను తన పదవికి రాజీనామా చేయాలని చెప్పారు. అయితే.. పదవిని వదులుకోవటానికి సిద్ధంగా లేని శశికళా.. అమ్మ మీదనే రాజ్యసభలో ఆరోపణలు చేయటం.. ఆమె తనను కొట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అమ్మలాంటి అధినేత్రి మీద ఒక రాజ్యసభ సభ్యురాలు అంతేసి మాటలన్న తర్వాత ఆమె మీద వేటు పడటం మామూలే. అయినప్పటికీ పదవిని వదిలిపెట్టకుండా ఉన్న శశికళపై తాజాగా కొత్త ఆరోపణలు షురూ అయ్యాయి. తమిళ రాజకీయాలకు తగ్గట్లే శశికళ మీద కేసుల పరంపర మొదలైంది. కాంట్రాక్టు ఇప్పిస్తానంటూ రూ.20 లక్షలు తీసుకొని మోసగించారంటూ ఆమెపై అన్నాడీఎంకేకు చెందిన ఒక నేత ఫిర్యాదు చేయటం.. ఆమెపై కేసు నమోదు చేయటం జరిగాయి.

అన్నాడీఎంకేకు చెందిన రాజేష్ అనే నేత పాళయంకోట పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ట్రావెల్స్ సంస్థను నిర్వహించే ఇతగాడికి రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లకు నీళ్లు పోసే కాంట్రాక్టు పనులు ఇచ్చేందుకు సిఫార్సు చేసేందుకు రూ.20లక్షల్ని రెండు విడతలుగా శశికళకు తాను చెల్లించినట్లుగా చెప్పుకొచ్చారు. తాను రూ.20లక్షలు ఇచ్చినా కాంట్రాక్టు మాత్రం ఇప్పించలేదంటూ ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. సదరు అన్నాడీఎంకే నేత ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ షురూ చేశారు. చూస్తుంటే.. శశికళకు రానున్న రోజుల్లో ‘అమ్మ’ తిప్పలు తప్పేలా లేవు.