Begin typing your search above and press return to search.

చీటింగ్ కేసు.. మాజీ సీఎం భార్య విచారణ.. పారిపోనని స్టేట్ మెంట్!

By:  Tupaki Desk   |   8 Jan 2021 8:52 PM IST
చీటింగ్ కేసు.. మాజీ సీఎం భార్య విచారణ.. పారిపోనని స్టేట్ మెంట్!
X
'నాకు బీజేపీ నాయకులు చాలా మంది తెలుసు.. ఎలాంటి పని కావాలన్నా చేసి పెడతా' అంటూ వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన యువరాజ్ పై చీటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే.. నిందితుడు యువరాజ్ నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ప్రముఖ నటి, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య రాధిక! ఈ క్రమంలో సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను విచారించారు.

రూ. వందల కోట్ల స్కామ్..
ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుని అనేక మందికి కుచ్చుటోపీ పెట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువరాజ్ అలియాస్ యువరాజ్ స్వామి వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఎంక్వైరీలో అనేక విషయాలతోపాటు పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి.

తెరపైకి మాజీ సీఎం భార్య..!
నిందితుడు యువరాజ్ బ్యాంకు అకౌంట్ల నుంచి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి రెండో భార్య రాధిక కుమారస్వామి బ్యాంకు ఖాతాలకు భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఆ నగదు ఎంత అనే విషయంపై క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం విచారణకు హాజరుకావాలని రాధిక కుమారస్వామికి నోటీసులు జారీ చేశారు.

మూడు గంటలపాటు రాధిక విచారణ..
రాధికను పోలీసులు మూడు గంటలపాటు విచారించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు కార్యాలయానికి రాధిక వెళ్లారు. బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ విభాగం ఏసీపీ నాగరాజ్ నేతృత్వంలోని పోలీసులు.. ఆమెను సుమారు మూడు గంటలకు పైగా విచారించారు. ఆమె నుంచి లిఖితపూర్వకంగా వివరాలు సేకరించారు.

నేను ఎక్కడికీ పారిపోను..
పోలీసుల విచారణ పూర్తి అయిన తరువాత రాధిక మీడియాతో మాట్లాడారు. తాను ఎక్కడికి పారిపోనని, ముందు చెప్పిన మాటకే కట్టుబడి ఉంటానని అన్నారు. పోలీసులు మళ్లీ తనను విచారణకు హాజరుకావాలని సూచిస్తే ఖచ్చితంగా విచారణ ఎదుర్కొంటానని అన్నారు.

నాకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదు..
తాను ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకోలేదని, ఇంతకు ముందు మీడియా సమావేశంలో చెప్పినమాటకు కట్టుబడి ఉన్నానన్నారు. చీటింగ్ కేసులో అరెస్టు అయిన యువరాజ్ అలియాస్ స్వామి చెప్పిన వివరాలను పూర్తిగా బయటకు లాగాలనే ఉద్దేశంతోనే రాధిక కుమారస్వామిని విచారించామని జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ చెప్పారు. రాధిక కుమారస్వామి ఈ రోజు, గతంలో చెప్పిన వివరాలను పరిశీలించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.