Begin typing your search above and press return to search.

చీప్ లిక్కర్ కనిపెట్టిన చీప్ ఛీప్ మినిస్టర్ చంద్రబాబు : కొడాలి నాని

By:  Tupaki Desk   |   23 March 2022 11:38 AM GMT
చీప్ లిక్కర్ కనిపెట్టిన చీప్ ఛీప్ మినిస్టర్ చంద్రబాబు : కొడాలి నాని
X
ఏపీ అసెంబ్లీ మంత్రి కొడాలి నాని కౌంటర్లతో దద్దరిల్లింది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో సంభవించిన మరణాలపై చెలరేగిన రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. నాటుసారాతోనే వారు మరణించారని టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలను అధికార వైసీపీ తిప్పి కొడుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష టీడీపీ ఈ మేరకు ఎదురుదాడి చేస్తోంది.

ఈ క్రమంలోనే వైసీపీ కౌంటర్ అటాక్ కు దిగింది. చంద్రబాబు ప్రబుత్వ హయాంలో అనుమతి పొందిన మద్యం బ్రాండ్లను తవ్వి తీసింది. ఈ అంశంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. అసెంబ్లీ వేదికగా చెలరేగిపోయారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. తన ప్రభుత్వ హయాంలో చంద్రబాబు 240 మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు.

జేబ్రాండ్స్ అంటూ టీడీపీ చెబుతున్నవన్నీ చంద్రబాబు హయాంలో అనుమతి పొందినవేనంటూ జీవోలు సైతం ఉన్నాయని కొడాలి నాని ఆరోపించారు.

'ప్రెసిడెన్షియల్ మెడల్, బూమ్ బూబ్ వంటి బ్రాండ్లకు అనుమతి ఇచ్చిన నిష్ట దరిద్రుడు చంద్రబాబేనని కొడాలి నాని మండిపడ్డారు. దీనికి సాక్ష్యంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో విడుదలైన జీవోలు ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు వాటిని వైఎస్ జగన్ అనుమతి ఇచ్చినట్టు టీడీపీ చెబుతుండడంలో అర్థం లేదన్నారు. చంద్రబాబు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నానడానికి ఇదే నిదర్శనమని కొడాలి నాని విమర్శించారు.

తమ ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ఎలాంటి అవకాశం లేకపోవడం వల్లే తాము చేసిన తప్పులను కూడా ఇప్పుడు తెరమీదకు తీసుకొస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. టీడీపీ సబ్యులు పార్టీ మారాలని ఆయన సలహా ఇచ్చారు. లేదా చంద్రబాబును అయినా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని సూచించారు. చంద్రబాబును నమ్ముకుంటే మునిగిపోతారని జోస్యం చెప్పారు. చిడతలు కొట్టడం మానేసి.. సభ కొనసాగడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే చిడతలు వాయించారు. మరో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజిల్స్ వేశారు. దీనిపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ గౌరవాన్ని కించపరిచారని కొడాలి నాని సైతం నిప్పులు చెరిగారు.