Begin typing your search above and press return to search.

ఏపీ ఏ మాత్రం స్పెషల్ కాదన్న కేంద్రమంత్రి

By:  Tupaki Desk   |   20 April 2016 12:10 PM IST
ఏపీ ఏ మాత్రం స్పెషల్ కాదన్న కేంద్రమంత్రి
X
ఇష్టం వచ్చినట్లుగా ఏపీ విభజన చేయటంతో వచ్చిన తలనొప్పులు ఇప్పటికి ఒక కొలిక్కి తీరకపోవటం తెలిసిందే. విభజన జరిగి ప్రభుత్వాలు ఏర్పడి రెండేళ్లు అవుతున్నా.. నేటికి ఆ తప్పుల తిప్పల నుంచి ఏపీ బయటపడింది లేదు. వృద్ధిరేటు ఆశావాహకంగా ఉన్నప్పటికి విభజన కారణంగా మీద ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం ఒక కొలిక్కి రావటం లేదు. ఇలాంటి సమయంలో పెద్దన్న హోదాలో కేంద్రం సాయం చేస్తుందని.. ఏపీని ఆదుకుంటుందని విభజన సందర్భంగా చెప్పిన మాటలన్నీ నీటి మూటలేనన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.

విభజన కారణంగా ఏపీని ఆదుకుంటామని విభజన సమయంలో చెప్పిన కాంగ్రెస్.. బీజేపీలు రెండూ దొందూ దొందూలేనన్న చేదు నిజం సీమాంధ్రుడికి అర్థమవుతోంది. తాజాగా కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు చేస్తే ఏపీ పట్ల వారికి ఎలాంటి బాధ లేదన్న విషయం స్పష్టమవుతోంది. ఏడాపెడా విభజన చేసేసి కాంగ్రెస్ చేతులు దులుపుకుంటే.. వారు చేసిన అడ్డగోలు విభజనను ఓకే అంటూ బీజేపీ పెద్ద తప్పే చేసింది. విపక్షంగా తాము ఏమీ చేయలేకపోయామని.. తాము కానీ అధికారంలోకి వస్తే చాలానే చేస్తామని చెప్పిన కమలనాథుల్ని సీమాంధ్రులు బాగానే నమ్మారు. అయితే.. అదంతా పచ్చి మోసమన్న వాస్తవం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.

తాజాగా కేంద్ర పంచాయితీరాజ్.. గ్రామీణాభివృద్ధి మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ ఏపీకి వచ్చారు. ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సదరు కేంద్రమంత్రి.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అన్ని రాష్ట్రాలతో సమానంగానే ఏపీని చూస్తామని చెప్పటం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి బాగుందని.. ఏపీ సీఎం చంద్రబాబు సమర్థుడని.. బయట నుంచి అప్పులు తీసుకురాగలరంటూ బీరేంద్రసింగ్ వ్యాఖ్యానించటం గమనార్హం. కేంద్రం కొద్దిపాటి సాయం అందించినా మరికొన్నేళ్లలో మిగిలిన రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గతంలో సాయం చేస్తామని మాట వరసకైనా చెప్పేవారు. ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి సమర్థుడు కాబట్టి అప్పులు తెచ్చుకొని బతికేయమంటున్నారు. ఆదుకోవాల్సిన కేంద్రం నోటి నుంచి ఇలాంటి మాట రావటం చూస్తే.. ఏపీ మీద వారికెంత మమకారం ఉందో ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.