Begin typing your search above and press return to search.

విద్యార్ధులకి శుభవార్త : టెన్త్, ఇంటర్‌ పరీక్షలు లేవు .. అందరూ పాస్ !

By:  Tupaki Desk   |   14 May 2020 6:09 PM IST
విద్యార్ధులకి శుభవార్త : టెన్త్, ఇంటర్‌ పరీక్షలు లేవు .. అందరూ పాస్ !
X
దేశ వ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా లాక్‌ డౌన్ విధించడంతో అన్ని విద్యా సంస్థలూ మూతపడ్డాయి. అందులోనూ పరీక్షల సమయం కావడంతో పరీక్షలని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. పదో తరగతి సహా అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 22వ తేదీ నుంచి స్కూళ్ల, కాలేజీలు మూసే ఉన్నాయి. ఇకపోతే, ఇటీవల కొన్ని మినహాయింపులను కేంద్రం ఇస్తుండటంతో పరీక్షల నిర్వహణపై చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయి. అలాగే ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో 1 నుండి 9 వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రోమోట్ చేయడం జరిగింది. ఈ తరుణంలోనే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మాత్రం టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపాలని నిర్ణయించింది.

ప్రస్తుతంమహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని భావించిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల అక్కడ పది, ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయినా మధ్యలో వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుత పరీస్థితుల్లో పరీక్షలు నిర్వహించే కంటే పై తరగతులకు పంపడమే ఉత్తమమని ఛత్తీస్‌గఢ్ విద్యాశాఖ అభిప్రాయపడింది. దీంతో ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా.. విద్యార్థులకు మార్కులు కేటాయించి పై తరగతులకు ప్రమోట్ చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం కూడా దగ్గర పడుతోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అలాగే, గతంలో అంటే లాక్ డౌన్ కి ముందు నిర్వహించిన పరీక్షలకి హాజరుకాని వారిని కూడా సాధారణ మార్కులతో పాస్ చేయాలని విద్యాశాఖ అధికారులను సూచించింది. ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ కాకుండా అందరినీ పాస్ చేసి పై తరగతులకు పంపాలని అధికారులను ఆదేశించింది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం. దీంతో అక్కడి విద్యార్థులు తెగ సంబరపడిపోతున్నారు.