Begin typing your search above and press return to search.

జంపింగ్ మాల్యా ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

By:  Tupaki Desk   |   10 March 2016 7:29 AM GMT
జంపింగ్ మాల్యా ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
X
దేశవ్యాప్తంగా పలు బ్యాంకులకు రూ.9వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి.. సీక్రెట్ గా దేశం నుంచి జంప్ అయిన ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అని అడిగితే ఎవరికి తెలీదన్న మాట వినిపిస్తుంది. అంత పెద్ద మనిషి సీక్రెట్ గా వెళ్లే అవకాశమే లేదు. ఒకవేళ వెళ్లినా.. దర్యాప్తు సంస్థలు సరిగ్గా దృష్టి సారించాలే కానీ.. అయ్యగారిని ఐదు నిమిషాల్లో ట్రేస్ చేసి పారేయొచ్చు. కానీ.. సుప్రీంకోర్టు అడిగేంతవరకూ అయ్యగారు దేశం నుంచి జంప్ అయిన విషయాన్ని బయటకు చెప్పని దర్యాప్తు సంస్థలు.. భవిష్యత్తులోనూ ఆయనకు బేడీలు వేసి తీసుకొచ్చే ఛాన్స్ లేదన్న విమర్శ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇంతకీ విలాస పురుషుడు విజయ్ మాల్యా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అన్న విషయంపై మీడియా పోకస్ చేసింది. దర్యాప్తు సంస్థలకు అంతుచిక్కని వ్యక్తిగా మారిన విజయ్ మాల్యా లెక్కల్ని కొన్ని ప్రముఖ మీడియా సంస్థలకు బయటకు తెచ్చేశాయి. ఇప్పుడాయన బ్రిటన్ లోని ఉన్నాడు.

అందరూ అనుకున్నట్లుగా లండన్ నడిబొడ్డున ఉన్న బార్కర్ వీధిలో ఉండే మేడమ్ టుస్సాడ్ మ్యూజియం పక్కన ఉన్న రెండో భవంతిలో ఆయన ఉన్నారనుకుంటే తప్పులో కాలేసినట్లే. చూస్తూ.. చూస్తూ మాల్యా అలాంటి చోట ఎందుకు ఉంటారు చెప్పండి.

ఇంతకీ మాల్యా ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే.. లండన్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘‘హెర్ట్ ఫర్ షైర్’’ అనే కౌంటీలో భారీ భవంతి ఉంది. ఎత్తైన ప్రాంతంలో ఉండే ఈ అత్యాధునిక భవంతి మొత్తానికి పెద్ద ఎత్తున సీసీ కెమేరాలు.. సెక్యూరిటీతో నిండి ఉంటుందట. ‘‘లేడీ వాక్’’ పేరిట ఈ భవంతి ఆ ఊరిలోనే అతి పెద్ద గృహంగా స్థానికులు చెబుతారు. విజయ్ మాల్యా ఆ ఊరికి వెళితే చాలంట.. కొత్త సందడి మొదలవుతుందట. ఆ ఊరికి ఫ్యాన్సీ కార్లు పెద్ద ఎత్తున వస్తాయట. రీసెంట్ గా ఒక బ్లాక్ ఆడీ కారులో ఒక మహిళ ఆ భవంతికి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న సందడి చూసినప్పుడు.. అక్కడ మాల్యా ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదట.

ఆ ఊరి వారితో సన్నిహితంగా ఉండే మాల్యా.. తాజాగా అక్కడికి సమీపంలో ఉండే వైట్ హార్స్ పబ్ కు వెళ్లాడట. ఆయనతో పాటు.. పలువురు యువతులు ఉన్నారట. ఆ పబ్ కి మాల్యా రెగ్యులర్ కస్టమర్ అట. మీడియాకు ఇన్ని విషయాలు తెలుస్తున్నా.. ఘనత వహించిన దర్యాప్తు సంస్థలకు ఈ విషయాలు తెలిసి.. ఆయనకు నోటీసులు ఇచ్చి.. అదుపులోకి తీసుకునేటప్పటికి ఎంత టైం పడుతుందో..?