Begin typing your search above and press return to search.

రఘువీరా ఎక్కడికి వెళ్లినా కొడుతున్నారు

By:  Tupaki Desk   |   5 Oct 2015 4:42 PM IST
రఘువీరా ఎక్కడికి వెళ్లినా కొడుతున్నారు
X
ప్రజల్లోకి వెళ్లి ఏదో చేద్దామనుకుంటున్న ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి పరాభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా సోమవారం చేదు అనుభవం ఎదురైంది... అదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో కావడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఆయనపైన టిడిపి కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. కొద్ది రోజుల కిందట కూడా రఘువీరాపై కృష్ణాజిల్లాలో బురదతో దాడి చేశారు. బందరు పోర్టుకు భూములివ్వమన్న రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన రఘువీరాపై మట్టితో దాడి చేశారు. ఇప్పుడు ఏకంగా రాళ్లతో కొట్టారు.

సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన రఘువీరా రెడ్డి కుప్పం నియోకవర్గానికి వెళ్లారు. అయితే కుప్పంలో ఊహించని విధంగా రఘువీరా రెడ్డిని టీడీపీ కార్యాకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన కాన్వాయ్ పైన చెప్పులు, రాళ్లు విసిరేశారు. దీంతో టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.... నిలువరించేందుకు ప్యత్నించిన పోలీసులకూ రాళ్ల దెబ్బలు తప్పలేదు.

కాగా రెండు రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో రఘువీరా పర్యటనలో పావురాలను తారాజువ్వలకు కట్టి ఎగురవేసిన ఘటనలోనూ రఘువీరా వివాదస్పదమయ్యారు. ఆయనపై పలువురు కేసులు పెట్టారు. ఇందులో రఘువీరా ప్రమేయం నేరుగా లేకున్నా తన కళ్ల ముందే పావురాలను తారాజువ్వలకు కడుతున్నా ఆయన వారించలేదని.... మూగజీవాలను హింసిస్తుంటే చూశారని కేసులు పెట్టారు. అసలే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ను వదిలిపెట్టకుండా కష్టపడి తిరుగుతున్న రఘువీరాకు ఎన్ని కష్టాలో..?