Begin typing your search above and press return to search.

హెచ్1బీ వీసా రూల్స్ లో మార్పులు.. మనోళ్లకు ఎంత నష్టమంటే?

By:  Tupaki Desk   |   9 Oct 2020 4:45 PM IST
హెచ్1బీ వీసా రూల్స్ లో మార్పులు.. మనోళ్లకు ఎంత నష్టమంటే?
X
కీలకమైన వీసా నిబంధనల్లో మార్పులు ఎంతలా ప్రభావితం చేస్తాయన్న విషయం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన హెచ్ 1బీ విధానాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అమెరికన్లకు ప్రయోజనం కలిగిస్తున్నాన్న సంకేతంతో అధ్యక్ష ఎన్నికల్లో భారీ ప్రయోజనాన్ని పొందాలని భావిస్తున్నారు. రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయం లక్షలాది మంది ప్రవాస భారతీయులకే కాదు.. దేశంలోని ఎంతో మంది డాలర్ డ్రీమ్స్ ను దెబ్బేసేలా చేస్తుందని చెప్పక తప్పదు.

ట్రంప్ సర్కారు అమల్లోకి తీసుకొచ్చిన తాజా మార్పుల కారణంగా అమెరికాలోని 2.8లక్షల మంది భారతీయ ఐటీ నిపుణల్ని ప్రభావితం చేయనున్నట్లు చెబుతున్నారు. ఐటీ ఉద్యోగాలు చేసే వారు మాత్రమే కాదు.. అక్కడి వర్సిటీల్లో చదివే వారికి కూడా నష్టం వాటిల్లేలా తాజా మార్పులు ఉన్నాయని చెబుతున్నారు. మనోళ్లకు జరిగే నష్టం.. దాని తీవ్రత ఎంతన్న విషయాల్లోకి వెళితే..

$ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల్లో అమెరికాలో ఐటీ సంబంధిత అడ్వాన్స్ డ్ డిగ్రీ పూర్తి చేసిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలి.
$ హెచ్1బీ వీసా దరఖాస్తులు చేసుకునే వారిలో 90 శాతం మంది లక్ష డాలర్ల కంటే తక్కువ వార్షిక వేతనం ఉన్న వారే. కొత్త నిబంధనల ప్రకారం హెచ్ 1బీ వీసా అప్లై చేయాలనుకుంటే కనిష్ఠంగా 1.10 లక్షల డాలర్ల వార్షిక వేతనం ఉండాలి. అప్పుడు మాత్రమే అర్హత సాధిస్తారు.
$ ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం 65వేల డాలర్ల వార్షిక వేతనం ఉన్నా దరఖాస్తు చేసుకునే వీలుంది. ఇంత భారీగా జీతాలు ఇవ్వటానికి కంపెనీలు ఆసక్తి చూపించవు. దీంతో.. మనోళ్ల ప్రయోజనాలు భారీగా దెబ్బ తింటాయి.
$ ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం నేరుగా కంపెనీ ఉద్యోగులైతే.. వారి వీసాను మూడేళ్లపాటు రెన్యువల్ చేసే వీలుంది. అదే.. కన్సెల్టీన్సీల ద్వారా కంపెనీలకు పని చేసే వారి వీసాల్ని ఏడాదికే ఇవ్వనున్నారు. తాజా నిర్ణయంతో వేలాది మంది మనోళ్లకు నష్టం వాటిల్లుతుంది.
$ కొత్త నిబంధనల ప్రకారం ఏటా వీసా రెన్యువల్ చేసుకోవాల్సి రావటం భారీగా భారం పడనుంది. దీంతో ప్రతి ఏటా రెన్యువల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం హెచ్ 1బీ వీసా కోసం అప్లై చేయాలంటే వీసా.. అటార్నీ ఫీజు కలిపి దగ్గర దగ్గర 7-8 వేల డాలర్ల వరకు అవుతుంది. అంటే.. ఏడాదిలో నెల జీతం ఈ ఖర్చుకే పోతే అంతకు మించిన భారం ఇంకే ఉంటుందని వాపోయే పరిస్థితి.
$ ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ లో ఏ కోర్సు చేసిన వారైనా ఐటీ ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. తాజాగా తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారం కేవలం ఐటీలో డిగ్రీ చేసిన వారికే అవకాశాలు లభిస్తాయి. వారికే.. హెచ్1బీ వీసాలు ఇస్తారు.
$ అమెరికాలో ఉన్నత చదువులు చదివే వారికి కొత్త నిబంధన సమస్యగా మారనుంది. వారి ప్రయోజనాల్ని దెబ్బ తీయనుంది. ఐటీలో మాస్టర్స్ చేయాలంటే.. ఇంజనీరింగ్ డిగ్రీ కూడా ఐటీనే అయి ఉండాలి. దీంతో.. వేరే బ్రాంచ్ లలో డిగ్రీ చేసిన వారికి ఉన్నత కోర్సులు చేసే అవకాశం అభించదు. ప్రస్తుతం అమెరికాలోని వర్సిటీల్లో చదివే 3 లక్ష లమంది ఐటీ విద్యార్థుల్లో సగం మంది డిగ్రీలు ఐటీయేతర కోర్సులు చేసిన వారే కావటం చూస్తే.. కొత్త నిబంధన ఎంతలా నష్టం చేస్తుందో అర్థమవుతుంది.
$ ట్రంప్ తెచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కోర్టులో సవాలు చేస్తే.. న్యాయ సమీక్ష ముందు నిలబడదని పలువురు నిపుణులు చెబుతున్నా.. అదంతా అయ్యే వరకు.. జరగాల్సిన నష్టం జరుగుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే కొత్త ఆర్డర్ గురువారం నుంచి అమల్లోకి వచ్చేసింది.