Begin typing your search above and press return to search.

వారికి పెద్ద పీట వేశామంటే.. వీరికి చిన్నపీట వేసినట్లేగా సజ్జల?

By:  Tupaki Desk   |   11 April 2022 4:46 AM GMT
వారికి పెద్ద పీట వేశామంటే.. వీరికి చిన్నపీట వేసినట్లేగా సజ్జల?
X
చేసిన పనిని సమర్థించుకోవటం అందరూ చేసేదే. కాకుంటే.. ఆ సమర్థింపు అందరి ఆమోదయోగ్యంగా ఉంటుందా? లేదా? అన్న దగ్గరే సమస్యంతా వస్తుంది. గడిచిన కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన జగన్ కేబినెట్ 2.0 అన్ లాక్ అయ్యింది. టెన్షన్ తీరిపోయి.. ఎవరికి అవకాశం లభించిందన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. పాత కేబినెట్ లోని పదకొండు మందికి మళ్లీ అవకాశం ఇచ్చిన సీఎం జగన్.. కొత్త వారిలో 14 మందికి చాన్సు ఇచ్చారు. మంత్రుల ఎంపికపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్య చేశారు.

రాజకీయ సాదికారత దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని.. కొత్త కేబినెట్ లో బీసీ.. ఎస్సీ.. ఎస్టీ.. మైనార్టీలకు ప్రాధాన్యతను ఇచ్చినట్లుగా ఆయన చెబుతున్నారు.

ఈ సందర్భంగా ఆసక్తికర పోలికను తీసుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీ.. ఎస్సీ.. ఎస్టీ.. మైనార్టీలకు 45 శాతం పదవులు ఇస్తే.. జగన్ మాత్రం ఏకంగా 65 శాతం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. విన్నంతనే వావ్ అనిపిస్తుంది కానీ.. కాస్త లోతుగా చూస్తే.. ఈ మాటలోని డొల్లతనం కనిపించక మానదు. అదేమంటే.. బీసీ.. ఎస్సీ.. ఎస్టీ.. మైనార్టీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామంటే.. మిగిలిన వారికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లే కదా?

సామాజిక న్యాయం అంటే ఎలా ఉండాలి? అందరికి సమానంగా పదవుల పంపిణీ జరగాలి. కొందరికి ఎక్కువగా.. మరికొందరికి తక్కువ చేయటం ఏమిటి? అన్న ప్రశ్నకు సజ్జల మాష్టారు సమాధానం ఏం చెబుతారన్నది ప్రశ్న.

అంతేకాదు.. పాత కేబినెట్ లోని 11 మందికి పదవులు దక్కినప్పుడు.. మిగిలిన 14 మంది చేసిన తప్పేంటి? వారి మీద వేటు వేయటం ఏమిటి? అన్నది కూడా ప్రశ్నే.

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి అన్ని కులాల వారు ఆయన మీద అభిమానాన్ని ప్రదర్శించి ఓటేశారు. అలాంటప్పుడు కొన్ని వర్గాల వారికి పదవులు కట్టబెట్టటం.. మిగిలిన వారికి మొండిచేయి చూపించటం దేనికి నిదర్శనం? అన్నది సందేహానికి సమాధానం చెప్పే వారెవరు. ఒకరికి ఎక్కువ అంటే.. మరొకరికి తక్కువనే లాజిక్ జనాలకు తెలీనట్లుగా సజ్జల చెబుతున్న మాటలు మిగిలిన వారికి మంట పుట్టించేలా చేస్తాయన్నది మర్చిపోకూడదు.