Begin typing your search above and press return to search.

విపక్షాల ముందు గొయ్యి అధికారపక్షం ఎదుట నుయ్యి

By:  Tupaki Desk   |   14 Dec 2015 8:31 AM GMT
విపక్షాల ముందు గొయ్యి అధికారపక్షం ఎదుట నుయ్యి
X
ఏపీలో పాలక టీడీపీ విచిత్రమైన పరిస్థితుల్లో పడింది. విపక్షాలకు చెందిన నేతలు రకరకాల కేసుల్లో చిక్కుకున్నప్పటికీ వారిపై దాడిచేసే అవకాశం ఏమాత్రం లేకుండా స్వపక్ష నేతలూ ఆరోపణల్లో చిక్కుకోవడంతో అందివచ్చిన అవకాశాలు పోయినట్లవుతోంది. తెలుగుదేశం పార్టీలోని ప్రజాప్రతినిధులు - నాయకులు కూడా పలు నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటుండడంతో ఎటూ చెప్పలేక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తల పట్టుకుంటున్నారు. ప్రతిపక్షాల నేతలు రకరకాల ఆరోపణలు - కేసుల్లో ఉన్నా వారిపై విరుచుకుపడే అవకాశం లేకుండా పోతోంది. గుడివాడలో కొడాలి నాని వ్యవహారం... అలాగే మచిలీపట్నంకు చెందిన మాజీ శాసనసభ్యుడు - వైసిపి నేత పేర్ని నానిని ఎక్సైజ్ అధికారులపై దౌర్జన్యం చేయడం... ఇలా.. భూకబ్జాల అక్రమ మద్యం వరకు అన్ని రకాల కేసుల్లోనూ విపక్ష నేతలు ఉంటున్నారు.

కొద్దిరోజుల క్రితమే విజయవాడ కాంగ్రెస్ అధ్యక్షుడు - మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుటుంబానికి చెందిన స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌ లో జరిగిన కల్తీ మద్యం వ్యవహారం కూడా కలకలం సృష్టించింది. ఈ వ్యవహారం తెలుగుదేశం నాయకులకు కాంగ్రెస్ పై పట్టుపెంచుకోవడానికి మంచి ఛాన్సుగా మారింది. కానీ, అంతలోనే కాల్ మనీ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే - ఎమ్మెల్సీలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుండడంతో టీడీపీ నోరు మెదపలేని పరిస్థితి.

పైగా దీనిపై విపక్షాలే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే పరిస్థితి ఏర్పడింది. కాల్ మనీ వ్యవహారం టీడీపీకి పెద్ద మచ్చగా మారిపోయింది. ఇది లేకుంటే విపక్షాలపై ఆధిపత్యం చూపడానికి టీడీపీకి మంచి అవకాశం ఉండేది. దీంతో చంద్రబాబు కృష్ఝా జిల్లా టీడీపీ నేతల కొందరి తీరుపై మండిపడుతూ వారిపై దృష్టిపెట్టినట్లు సమాచారం.