Begin typing your search above and press return to search.

మళ్లీ చంద్రయాన్-2

By:  Tupaki Desk   |   13 Jun 2019 9:40 AM GMT
మళ్లీ చంద్రయాన్-2
X
చంద్రుడిపై దిగటం కోసం రూపొందించిన అంతరిక్ష నౌకను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆవిష్కరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ లో చంద్రుడిపైకి ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ ను పంపించాలన్నది ఇస్రో ప్రణాళిక. ఇది విజయవంతమైతే.. చంద్రుడి మీద అంతరిక్ష నౌకను క్షేమంగా దింపిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. ఇంతకుముందు అమెరికా, అప్పటి సోవియట్ యూనియన్- చైనాలు మాత్రమే ఈ ఘనతను సాధించాయి.

చంద్రుడి మీద భారతదేశం చేపడుతున్న రెండో పరిశోధన కార్యక్రమం చంద్రయాన్-2. మొదటి మిషన్ చంద్రయాన్-1ను 2008లో ఇస్రో ప్రయోగించింది. అది చంద్రుడి చుట్టూ పరిభ్రమించింది కానీ చంద్రుడి ఉపరితలం మీద దిగలేదు. ఇప్పుడు చేపట్టిన చంద్రయాన్-2 మిషన్‌ లో అంతరిక్ష నౌక చంద్రుడి మీద దిగుతుంది. ఉపరితలం మీద పరిశోధన చేస్తుంది. నీరు, ఖనిజాలు, రాతి నిర్మాణాల సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ కొత్త అంతరిక్ష నౌకలో ఒక ల్యాండర్- ఒక ఆర్బిటర్- ఒక రోవర్ ఉంటాయి. దీనిని ఇస్రో పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు సిద్ధం చేస్తున్నారు.

ఈ నౌకలోని ల్యాండర్, రోవర్‌ లు సెప్టెంబర్‌ లో చంద్రుడి ఉత్తర ధృవం మీద దిగుతాయి. అది విజయవంతమైతే.. ఆ ప్రాంతంలో దిగిన తొలి అంతరిక్ష నౌకగా రికార్డు సృష్టిస్తుంది. ఈ రోవర్ చంద్రుడి మీద 14 రోజులు పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు. 2019, జూలై 15 తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ డా. కె.శివన్ వెల్లడించారు. జీఎస్ ఎల్వీ మార్క్-3 వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపడతామని పేర్కొన్నారు.

ఇందులో ముఖ్యంగా మూడు పరికరాలు.. ఆర్బిటర్- ల్యాండర్- రోవర్ లు ఉంటాయన్నారు. చంద్రయాన్-2 వ్యవస్థ మొత్తం బరువు 3,447 కేజీలు కాగా, వీటిలో ఒక్క ప్రొపెల్లర్ బరువే ఏకంగా 1,179 కేజీలు ఉంటుందని చెప్పారు. ఓసారి ఉపగ్రహాన్ని ప్రయోగించాక, ఇది స్వతంత్రంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. 2019 సెప్టెంబర్ 6 లేదా 7 తేదీల్లో ల్యాండర్ చంద్రుడిపై దిగుతుందని వెల్లడించారు. చంద్ర‌యాన్‌-2 ప్రాజెక్టు ఖ‌రీదు రూ.603 కోట్లు అని ఇస్రో చైర్మ‌న్ చెప్పారు.