Begin typing your search above and press return to search.

17ఏళ్లుగా ఒంటరిగా అడవిలోనే .. కారే ఇల్లు !

By:  Tupaki Desk   |   9 Oct 2021 12:20 PM IST
17ఏళ్లుగా ఒంటరిగా అడవిలోనే .. కారే ఇల్లు !
X
మనుషులు మనుషుల మధ్యే బతకగలరు. అంతేగానీ అడవుల్లో ఏకాకిగా బతకడానికి ఎవరు ఇష్టపడతారు? కానీ, ఓ మనిషి అడవిలోని కొండప్రాంతంలో బతికాడు. అది కూడా 17 ఏళ్లు. ఎవరూ తోడు లేకుండా, ఆకులు అలములు తింటూ, ఓ చిన్నపాటి గుహలో కాళ్లు ముడుచుకుని 17 ఏళ్లు అడవిలో సావాసం చేశాడు. చాలా చిత్రంగా వున్నప్పటికీ అతను కొన్ని పరిస్థితుల్లో అలా అడవిలో బతకాల్సి వచ్చింది. ఇన్నేళ్లలో అతన్ని ఏ క్రూరమృగం కూడా ఏమీ అనకపోవడం మరొక విచిత్రం. అయితే అతను అలా అడవిపాలు కావడానికి కారణం ఏంటంటే.. పొలం సాగు నిమిత్తం ఆయ‌న స్థానిక స‌హ‌కార బ్యాంకు నుంచి రూ.40 వేలు రుణం తీసుకున్నాడు. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆయ‌న త‌న బాకీ తీర్చ‌లేక‌పోయాడు. దీంతో అధికారులు ఆయ‌న పొలాన్ని వేలం వేశారు. మ‌న‌స్థాపం చెందిన చంద్ర‌శేఖ‌ర్ వెంట‌నే త‌న కారును, సైకిల్‌ను తీసుకొని అడ‌విలోకి వ‌చ్చేశారు. అప్పటి నుండి అక్కడే ఉంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే .. చంద్రశేఖర్ కు గతంలో నెక్రల్-కెమ్రాజీ అనే గ్రామంలో 1.5 ఎకరాల పొలం ఉండేది. దానిని సాగు చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవాడు. అయితే 2003 సంవత్సరంలో సహకార బ్యాంకు నుంచి రూ. 40వేల రుణం తీసుకున్నాడు. ఆ బాకీ తీర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ దానిని చెల్లించలేకపోయాడు. దీంతో అతని పొలాన్ని బ్యాంక్ వేలం వేసింది. ఇది భరించలేని చంద్రశేఖర్ తనకిష్టమైన 'ప్రీమియర్ పద్మిని కారుతో' సోదరి వద్దకు వెళ్లిపోయాడు. కొన్నాళ్ల తరువాత తన సోదరి కుటుంబంతో విభేదాలొచ్చాయి. దీంతో సొంత గ్రామానికి వెళ్లలేక, ఆత్మగౌరవం అడ్డొచ్చి, తనకెంతో ఇష్టమైన కారుతో అడవిలోనే ఒంటరిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో ఓ చోట కారును నిలిపి.. వర్షం, ఎండ నుంచి దానిని కాపాడుకునేందుకు ప్లాస్టిక్ కవర్ కప్పాడు. అడవిలో ఒంటరిగా జీవిస్తున్న చంద్రశేఖర్ వద్ద పాత సైకిల్ తో పాటు ఓ రేడియో కూడా ఉంది. పాత హిందీ మెలోడీ పాటలను ఇష్టంగా వినే అతను, జీవనోపాధి కోసం బుట్టలు తయారు చేసి సమీప గ్రామంలో విక్రయిస్తుంటాడు. వీటికి బదులుగా చిల్లర సరుకులు తీసుకుంటానని చెప్పాడు.

అడవి జంతువుల నుంచి తనకు ఎలాంటి హాని లేదంటున్నాడు చంద్రశేఖర్. తన గుడారం దగ్గరనుంచే ఏనుగులు వెళ్తుంటాయని, అవి తనను ఏమీ అనవు అని చెబుతున్నాడు. చంద్రశేఖర్ కూడా అటవీ వనరులు, జంతువులకు ఎలాంటి హాని తలపెట్టట్లేదని.. అందువల్ల తమకు అతనితో ఎలాంటి సమస్య లేదని అటవీ శాఖ సిబ్బంది చెప్పడం విశేషం. ఇక్కడ జీవిచడం తనకెంతో బాగుందంటాడు చంద్రశేఖర్.నేను అడవిలో చెట్లను నరకను. ఒక చిన్న మొక్కకు హాని చేసినా.. అటవీ శాఖ నాపై ఉంచిన నమ్మకాన్ని కోల్పోయినట్లే అని చెప్తాడు. ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్న చంద్రశేఖర్ గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇబ్రహీం.. స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి.. నిర్మించాడు కూడా. అయితే దానిని సున్నితంగా తిరస్కరించిన చంద్రశేఖర్.. తన ఇల్లు అడవిలోనే ఉందని చెప్పాడు.