Begin typing your search above and press return to search.

చంద్రబాబు సమాధానం చెప్పగలరా ?

By:  Tupaki Desk   |   7 Aug 2021 6:18 AM GMT
చంద్రబాబు సమాధానం చెప్పగలరా ?
X
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు రెండుకళ్ళ సిద్ధాంతం మరోసారి బయటపడింది. అమరరాజా కంపెనీ విషయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కంపెనీ యాజమాన్యాన్ని ప్రభుత్వం రాజకీయ కక్షలతో వేధిస్తున్నట్లు ఒకటికి పదిసార్లు ఆరోపిస్తున్నారు. కంపెనీ నుండి బయటకు వస్తున్న వాయువుల వల్ల వాతావరణం, కంపెనీ చుట్టుపక్కలున్న భూగర్భజలాలు విషపూరితమవుతున్నాయంటు ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

అందుకనే విషవాయువులు బయటకు రాకుండా లేదా కనీసమాత్రానికి తగ్గించే చర్యలు తీసుచోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కఠినంగా హెచ్చరించింది. యాజమాన్యం లెక్కచేయకపోవటంతో క్లోజర్ నోటీసు జారీచేసింది. ఇలాంటి నోటీసు ఒక్క అమరరాజాకు మాత్రమే కాదు ఇంకా 54 కంపెనీలకు కూడా ఇచ్చింది. అయితే అమరరాజాకు ఇచ్చిన నోటీసుపైన మాత్రమే రచ్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ కంపెనీ టీడీపీ ఎంపి గల్లా జయదేవ్ ది కావటమే కారణం.

సీన్ కట్ చేస్తే విశాఖపట్నం శివార్లలోని ఎల్జీ పాలిమర్స్ లో విషవాయువులు వెలువడి 10 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయమై అప్పట్లో చంద్రబాబు మాట్లాడుతు ఎల్జీ పాలిమర్స్ సంస్ధను ప్రజల మధ్య నుండి ప్రభుత్వం ఎందుకు తరలించకూడదని పదే పదే డిమాండ్ చేశారు. కెంపెనీ యాజమాన్యంతో జగన్మోహన్ రెడ్డి కుమ్మకైన కారణంగే ప్రభుత్వం చర్యలు తీసుకోవటంలేదని గుడ్డకాల్చి మీదేసేశారు. వెంటనే ఎల్జీ పాలిమర్స్ ను జనావాసాల మధ్యలో నుండి తరలించాలంటు నానా రచ్చ చేశారు.

మరి అదే రూలు ఇపుడు అమరరాజాకు వర్తించదా ? అని ఎంఎల్ఏ రోజా సూటిగా నిలదీశారు. నిజానికి ఎల్జీ పాలిమర్స్ ప్రారంభించినపుడు ఊరికి దూరంగానే ఉండేది. తర్వాత కంపెనీ చుట్టు జనావాసాలు పెరిగిపోవటంతో ఫ్యాక్టరీ ఊరికి మధ్యలో ఉన్నట్లయపోయింది. ఇపుడు అమరరాజాది కూడా అదే పరిస్దితి. పైగా యూనిట్లో నుండి ప్రమాధకరమైన వాయువులు వస్తున్నాయని స్వయంగా హైకోర్టే తేల్చింది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోతే తగిన చర్యలను తానే తీసుకుంటానని హైకోర్టు గతంలోనే అమరరాజా యాజామాన్యానికి వార్నింగ్ ఇఛ్చింది.

ఎల్జీ పాలిమర్స్ విషయంలో ఒకలాగ, అమరరాజా ఫ్యాక్టరీ విషయంలో మరో లాగ చంద్రబాబు ఎందుకు మాట్లాడుతున్నారని రోజా ప్రశ్నకు సమాధానం చెప్పగలరా ? పోనీ కంపెనీ విషయాన్ని తేల్చేందుకు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటిని వేయాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు ఎందుకు డిమాండ్ చేయకూడదు ? పోనీ నోటీసులందుకున్న మిగిలిన 53 ఫ్యాక్టరీల విషయాన్ని చంద్రబాబు ఎందుకు ప్రస్తావించటంలేదు ? ప్రతి విషయాన్ని చంద్రబాబు రాజకీయమే చేస్తున్నారు. ఇదే చంద్రబాబు తాను అధికారంలో ఉన్నపుడు భారతీ సిమెంట్స్ కు పదే పదే నోటీసులిప్పించారని ఎవరైనా అంటే ఒప్పుకుంటారా ?