Begin typing your search above and press return to search.

మెగాస్టార్ దెబ్బను మరచిపోలేకపోతున్న చంద్రబాబు

By:  Tupaki Desk   |   12 Jan 2022 7:30 AM GMT
మెగాస్టార్ దెబ్బను మరచిపోలేకపోతున్న చంద్రబాబు
X
‘చిరంజీవి 2009లో పార్టీ పెట్టకపోయుంటే అధికారంలోకి వచ్చుండే వాళ్ళం’ ఇది తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య. అప్పుడెప్పుడో జరిగిపోయిన దాన్ని చంద్రబాబు ఇంకా మరచిపోలేకపోతున్నారు. అంటే చిరంజీవి దెబ్బ అప్పట్లో ఎంతగా పడిందో అర్ధమవుతోంది. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ప్రజారాజ్యం ఊపు చూసిన వాళ్ళకు చిరంజీవి ముఖ్యమంత్రి అయిపోతారనే అనిపించింది. కానీ చివరకు పార్టీ చుట్టు అనేక వివాదాలు ముసురుకున్నాయి.

ఎన్నికల తర్వాత చూస్తే పార్టీ తరపున 18 మంది ఎంఎల్ఏలు గెలిచారు. అలాగే పార్టీకి 20 శాతం ఓట్లొచ్చాయి. ప్రజారాజ్యంపార్టీకి 18 మంది ఎంఎల్ఏలు గెలవటం కూడా అప్పట్లో గొప్పనే చెప్పుకోవాలి. అయితే అప్పుడు జరిగిందేమంటే ఓడిపోయిన ప్రజారాజ్యంపార్టీ అభ్యర్ధుల్లో అత్యధికులకు కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచిన మెజారిటికన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంటే ఆ తేడా వల్లే టీడీపీ అధికారంలోకి రాలేకపోయిందనే విశ్లేషణలు కూడా కనిపించాయి.

అదే విషయాన్ని తాజాగా చంద్రబాబు ప్రస్తావించారు. అయితే చంద్రబాబు మరచిపోయిన విషయం ఏమిటంటే ప్రజారాజ్యం పార్టీ లేకపోతే టీడీపీనే గెలిచేదనే గ్యారెంటీ ఏమీలేదు. కాంగ్రెస్ కు ఇంకా మెజారిటి వచ్చుండేదేమో. అసలీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే సినిమా టికెట్ల ధరలను తగ్గించిన నేపధ్యంలో సినిమా వాళ్ళంతా చంద్రబాబుకు సన్నిహితులే కాబట్టి పరిశ్రమ మీద ప్రభుత్వం దెబ్బ కొడుతోందనే వాదన తెరపైకి తెచ్చారు.

ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తు పరిశ్రమ అంతా తనకు బాగా సన్నిహితులనటంలో అర్ధం లేదన్నారు. తనకు సన్నిహితుడైన చిరంజీవి పార్టీ పెట్టి దెబ్బ కొట్టలేదా ? తనకు వ్యతిరేకంగా సినిమాలు తీయలేదా ? అంటు మండిపడ్డారు. మోహన్ బాబు, నాగార్జున, కృష్ణ ఫ్యామిలీ (ఇపుడు కాదేమో), పోసాని, పృథ్వి, పలువురు నిర్మాతలు దర్శకులు చంద్రబాబు అంటే మండిపోతారు. ఇన్నాళ్లు దీనిపై ఎన్నడూ బాబు నోరు విప్పలేదు. తాజాగా పేరు పెట్టకుండా ప్రస్తావించారు. అయితే ఇక్కడ చంద్రబాబుకు సన్నిహితులా కాదా అన్నది ప్రధానం కాదు.

మరో వైపు వైసీపీ బాధ ఏంటంటే... జగన్మోహన్ రెడ్డిని పరిశ్రమలోని ప్రముఖుల్లో చాలామంది లెక్కే చేయటంలేదన్నది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వారిని పరిశ్రమ కలిసి అభినందించటం ఆనవాయితి అని... కానీ ఆపని ఇప్పటివరకు పరిశ్రమ చేయలేదని వైసీపీ అభిప్రాయం. అభినందించడం, కలవటం, కలవకపోవటం ఎవరిష్టం వాళ్ళది. ఈ విషయాన్ని పట్టించుకుని పెద్దది చేసుకోవడం వల్ల ఏమి ఉపయోగం?