Begin typing your search above and press return to search.

చంద్రబాబు బీజేపీకి వర్తమానాలు పంపుతున్నారా

By:  Tupaki Desk   |   7 Oct 2019 11:47 AM IST
చంద్రబాబు బీజేపీకి వర్తమానాలు పంపుతున్నారా
X
తెలుగుదేశం పత్రికకు బాగా అనుకూలం అయిన ఒక మీడియా వర్గం అధినేత వెళ్లి అమిత్ షాను కలవడం ఆసక్తిదాయకంగా మారింది. ఈ సమావేశం గురించి ఆయన తన మీడియా వర్గం ద్వారా రకరకాల ప్రచారాలు చేయించుకుంటూ ఉన్నారు. తననే అమిత్ షా పిలిచారని, అమిత్ షా ఆహ్వానం మేరకే తను వెళ్లినట్టుగా ఆయన డబ్బా కొట్టించుకుంటున్నారు.

అంతే కాదట.. జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ త్రీ సెవెన్టీని రద్దు చేయడం గురించి అమిత్ షా తనకు వివరించినట్టుగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. అమిత్ షాకు వేరే పని లేదు మరి. ఈయనకు వివరించనదే ఎవ్వరూ ఒప్పుకోరు కదా.. అనే సెటైర్లు పడుతున్నాయి ఈ ప్రచారం పట్ల.

గంటన్నర పాటు అన్ని పనులూ మానుకుని ఈయనకు అమిత్ షా వివరించి ఉంటారనేది కామెడీగా మారింది. ఆ సంగతలా ఉంటే.. ఇదంతా చంద్రబాబు వ్యూహం మేరకు జరుగుతున్నది అనే టాక్ కూడా మొదలైంది. తనకు బాగా కావాల్సిన వ్యక్తిని అమిత్ షా వద్దకు పంపించి చంద్రబాబు నాయుడు సంధి రాయబారాలు మొదలుపెట్టారనే టాక్ మొదలైంది.

ఈ మీడియాధినేతకు చంద్రబాబు నాయుడుతో ఎంత సాన్నిహిత్యం ఉందో అందరికీ తెలిసిందే. చంద్రబాబు కోసమే తన మీడియా వర్గాలను నడుపుతూ ఉన్నాడాయన. తెలుగుదేశం పార్టీ ఓటమితో బాగా నిస్పృహకు గురి అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆ మీడియాధినేతే. ఇలాంటి నేపథ్యంలో.. చంద్రబాబు కోసం రాయబారిగా ఢిల్లీకి వెళ్లడానికి ఈయన ఏ మాత్రం మొహమాట పడి ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

డైరెక్టుగా తనే రంగంలోకి దిగి సాగిలాపడిపోవడానికి ముందు, ఇలా చంద్రబాబు నాయుడు తన అనుచవర్గాన్ని ఢిల్లీ చుట్టు తిప్పుతున్నారనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. బీజేపీ వారి ప్రాపకం కోసం చంద్రబాబునాయుడు ఎంతకైనా తెగించగల ఘనుడే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.