Begin typing your search above and press return to search.

చంద్రబాబు చాణక్యం...గ్యాప్ పెరగాల్సిందే... ?

By:  Tupaki Desk   |   2 Feb 2022 2:30 PM GMT
చంద్రబాబు చాణక్యం...గ్యాప్ పెరగాల్సిందే... ?
X
రాజకీయాల్లో చాణక్యం కావాలి. ప్రత్యర్ధిని ఎప్పటికపుడు చిత్తు చేయడానికి పదునైన వ్యూహాలు కావాలి. ఆ విషయంలో చంద్రబాబు బుర్ర పాదరసంగానే పనిచేస్తుంది. ఆయన మంచి టైమ్ చూసుకుంటారు కూడా. అందుకే ఆయన బీజేపీ బడ్జెట్ మీద పెదవి విరిచేశారు. రైతులు, పేదలు అంటూ చాలా వర్గాలను తెర ముందుకు తెచ్చారు. మోడీ బడ్జెట్ నిరాశాజనకమని, ప్రత్యేకించి ఏపీకి తీరని అన్యాయం జరిగిందని కూడా బాబు అన్నారు.

అక్కడితో ఆయన ఆగలేదు, ఈ తప్పు అంతా ఏపీని ఏలుతున్న పెద్దలది అంటూ జగన్ కి తగిలించేశారు. 28 మంది ఎంపీలు చేతిలో ఉన్నా జగన్ ఏం సాధించారు ఏపీకి అంటూ సూటిగానే బాణాలు వదిలారు. జగన్ అసమర్ధత వల్లనే ఇదంతా అంటూ గట్టిగా తగులుకున్నారు. మొత్తానికి అటు బీజేపీ మీద ఇటు జగన్ మీద ఒకే కాలంలో చంద్రబాబు చండ ప్రచండమయ్యారు.

అయితే దీని వెనక భారీ స్కెచ్ ఉందని అంటున్నారు. ఏపీలో మళ్ళీ 2018 నాటి పరిస్థితులే రాబోతున్నాయని కూడా అంటున్నారు. అదెలా అంటే అప్పట్లో ప్రత్యేక హోదా సహా విభజన హామీలను ఏవీ సాధించలేని చంద్రబాబు సర్కార్ మీద జగన్ ఆయుధాలను ప్రయోగించారు. ఏమీ చేయకుండా ఎందుకు ఎన్డీయేతో అంటకాగుతున్నారు, తక్షణం బయటకు వచ్చేయండి అని అల్టిమేటం జారీ చేశారు. ఒక విధంగా జగన్ నాడు వ్యూహాత్మకంగా బాబు మీద వత్తిడి పెంచారు.

దాంతో చంద్రబాబు బయటకు రావాల్సి వచ్చింది. బీజేపీతో కటీఫ్ అని కూడా ప్రకటించాల్సి వచ్చింది. దాంతో బాబు పొలిటికల్ గా వీక్ అవడం, అన్నీ కలసి వచ్చి జగన్ సీఎం అయ్యారు, ఇపుడు ఎన్డీయేలో వైసీపీ లేదు. కానీ తెర వెనక దోస్తీ అలా సాగిపోతోంది అన్న డౌట్లు అందరికీ ఉన్నాయి. కేంద్రం ఏ బిల్లు తెచ్చిన మద్దతు ఇవ్వడం తప్ప వైసీపీ ఎంపీలు ఈ రెండున్నరేళ్ళలో ఎక్కడా వ్యతిరేకించింది లేదు. దాంతో జగన్ దోస్తీకి నజరానా ఏంటి అన్న చర్చ కూడా వస్తోంది.

కేవలం వ్యక్తిగత అవసరాలే తప్ప ఏపీకి సాయం చేయకపోయినా ఫరవాలేదు అన్నట్లుగా జగన్ ఉన్నారు అని కూడా విమర్శలు టీడీపీ చేస్తోంది. ఇక ఇన్నాళ్ళూ వేరు, ఇపుడు జనాల తీరు కూడా వేరుగా ఉంటోంది. వారిలోనూ ఓపిక నశిస్తోంది. ఏపీకి కేంద్రం ఏమివ్వడం లేదని తెలిసినా జగన్ మాట్లాడకపోవడం మీద అంతకంతకు ఆగ్రహం పెరుగుతోంది. ఆయన పెదవి విప్పాలనే అంతా కోరుతున్నారు. ఆ విధంగా జగన్ మీద వత్తిడి పెంచేందుకు బాబే బీజేపీ ని ముందుగా విమర్శించారు అంటున్నారు.

మరో వైపు చూస్తే బీజేపీని జగన్ టార్గెట్ చేస్తే జరిగే పరిణామాలు కూడా తెలుసు. ఏపీలో వైసీపీని పొలిటికల్ గా వీక్ చేయడానికి కేంద్రం చూస్తుంది. దాంతో పాటు ఏపీలో మరో ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీయే ఆ పార్టీకి జట్టు కట్టే ఏకైక ఆప్షన్ అవుతుంది. ఇదీ బాబు మార్క్ స్ట్రాటజీ అంటున్నారు. ఇంకో వైపు పవన్ బీజేపీ మిత్రుడిగా ఉన్నారు. ఏపీకి బీజేపీ ఏ సాయం చేయకపోయినా పవన్ దోస్తీగా ఉంటే జనాలు హర్షించరు. అది ఇవాళ కాకపోయినా రేపు అయినా పవన్ మీద వత్తిడే అవుతుంది. అంటే పవన్ని దగ్గరకు తీయడానికి కూడా బాబు కాషాయానికే నేరుగా గురి పెట్టారని అంటున్నారు.

ఇవన్నీ రాజకీయ వ్యూహాలు అయితే జన సామాన్యంలో అయితే బీజేపీ మీద పీక బండెడు కోపం ఉంది. ఎనిమిదేళ్ళుగా ఏపీకి ఏమీ ఇవ్వని బీజేపీ మీద కారాలూ మిరియాలూ జనాలు నూరుతున్నారు. బీజేపీని ఎవరు విమర్శించినా జనాల మద్దతు అయితే కచ్చితంగా ఉంటుంది. గత ఎన్నికల ముందు బీజేపీతో నాలుగేళ్లు అంటకాగడం వల్లనే బాబు ఓడిపోయారు. ఇపుడు చూస్తే బీజేపీని ఎదిరించిన మొనగాడిగా జనాల్లో మార్కులు తెచ్చుకుంటే ఆయన గ్రాఫ్ పొలిటికల్ గా ఒక్కసారిగా పెరగడమే కాదు, రేపటి రోజున బాగా ప్లస్ అవుతుంది అన్న అంచనాలు ఉన్నాయి. మొత్తానికి అధికారంలో ఉన్న వైసీపీ ఈ మొత్తం ఎపిసోడ్ లో అడ్డంగా దొరికిపోతే బీజేపీతో గ్యాప్ బాగా పెరిగితే అదే ఛాన్స్ అన్నట్లుగా జనాలలో తమ ప్రతిష్ట పెంచుకోవడానికి బాబు మాస్టర్ ప్లానే వేశారని అంటున్నారు.