Begin typing your search above and press return to search.

రాజధానికి ఏమీ ఇవ్వని భువనేశ్వరి ఉద్యమానికి గాజులు ఇచ్చారే?

By:  Tupaki Desk   |   2 Jan 2020 12:05 PM GMT
రాజధానికి ఏమీ ఇవ్వని భువనేశ్వరి ఉద్యమానికి గాజులు ఇచ్చారే?
X
అమరావతి రాజధానిగా ఏర్పాటు చేస్తూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకొని.. ప్రతి ఒక్కరూ అంతో ఇంతో అమరావతికి సాయం చేయాలని పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా పలువురు స్పందించారు. తమకు తోచిన సాయాన్ని అందించారు. ఆ సమయంలో అందరూ అంతో ఇంతో తమ వంతు సాయాన్ని ప్రకటిస్తే.. సీఎం హోదాలో చంద్రబాబు కానీ.. ఆయన సతీమణి భువనేశ్వరితో సహా కుటుంబ సభ్యులు ఎవరూ ఎలాంటి సాయాన్ని ప్రకటించింది లేదు.

అందరిని సాయం చేయాలని చెప్పే చంద్రబాబు.. తను సొంతంగా ఎందుకు సాయం చేయరు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అదే సమయంలో ఏమీ ఇచ్చింది కూడా లేదు. అలాంటిది తాజాగా ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయొచ్చేమో? అంటూ ఏపీ సీఎం హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య నేపథ్యంలో ఏపీలో రాజకీయం ఎలా మారిందో తెలిసిందే. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటును కొందరు మద్దతు పలుకుతుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

ఇలాంటివేళ అమరావతిలో రాజధాని ఏర్పాటును మార్చొద్దంటూ అక్కడి రైతులు చేస్తున్న నిరసనకు తమ మద్దతును ప్రకటించిన చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ఎంత రాజకీయం చేస్తున్నారో తెలిసిందే. ఎప్పుడూ రాజకీయాల్లో తలదూర్చని బాబు సతీమణి భువనేశ్వరి తాజాగా మాత్రం తన చేతికున్న గాజుల్ని ఉద్యమ ఖర్చుల కోసం వినియోగించాల్సిందిగా చెబుతూ ఇచ్చేశారు.

ఈ ఉదంతం అందరిని ఆశ్చర్యపర్చింది. నాడు అధికారంలో ఉన్నప్పుడు కడుతున్న రాజధాని అమరావతి కోసం చిల్లి గవ్వ ఇవ్వని బాబు కుటుంబం.. ఈ రోజు పవర్ పోయాక.. చేసే ఆందోళనలకు మాత్రం తన చేతికున్న ప్లాటినం గాజుల్ని తీసి ఇచ్చేయటం చూసినోళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు. రాజధానికి సాయం చేయటానికి రాని చేతులు ఇప్పుడు మాత్రం గాజులు ఇచ్చేయటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు గాజులు ఇచ్చిన ఆమె.. రాజధాని మీద అంత ప్రేమే ఉంటే అప్పట్లో ఎలాంటి సాయాన్ని ఎందుకు ఇవ్వనట్లు? అని ప్రశ్నిస్తున్నారు.